YCP leader Krishnaiah: ప్రస్తుత రోజుల్లో రాజకీయం అన్నది ఒక మత్తులా మారిపోయింది. పదవి దక్కిన తర్వాత ఒకలాగా పదవి దక్కకముందు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు రాజకీయ నాయకులు. ప్రస్తుతం ఒక రాజకీయ నాయకుడు ప్రవర్తన కూడా అలాగే ఉంది… పదవి రాక ముందు ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన జాతులకు అండగా నిలబడి కేంద్రం స్థాయిలో కొట్లాడిన వ్యక్తి. అతన్ని ప్రతి పార్టీ కూడా గౌరవించింది. తీరా ఆయనకు పదవి వచ్చేసరికి ఉద్యమకారుడు కాస్తా రాజకీయ నాయకుడై నమ్మిన జాతినే వ్యక్తులకు తాకట్టుపెట్టే స్థాయికి దిగజారిపోయాడు అంటూ ఆయనని దేవుడిగా చూసిన సంఘాలే ఆయనపై వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.
ఇంతకీ ఎవరు ఆ ఉద్యమకారుడు, ఎవరిని ఎవరికి తాకట్టు పెట్టాడు అన్న విషయాల్లోకి వెళితే.. ఆయన మరెవరో కాదు ఆర్ కృష్ణయ్య. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ హక్కుల కోసం గళమెత్తిన నాయకుల్లో కృష్ణయ్య ముందుంటారని చెప్పవచ్చు. బిసిల ఐక్యత కోసం, వారికి అన్నింటా తగిన గుర్తింపు కోసం క్రిష్ణయ్య చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. బిసి లకు క్రిష్ణయ్య జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చారు. దీంతో బీసీల్లో కృష్ణయ్యకు మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. బీసీల్లో ఆర్ క్రిష్ణయ్యకు ఉన్న క్రేజ్ చూసి వివిధ పార్టీలు కూడా ఆయనకి చట్టసభల్లో అవకాశం కల్పించాయి.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఎల్.బి.నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. ఆ మళ్ళీ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున మిర్యాలగూడ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆంధ్రలో వైసీపీ ప్రభుత్వం ఆర్.క్రిష్ణయ్య ని రాజ్యసభకు పంపించింది. ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా అయిన తరువాత నుండి ఆయనలో చాలా మార్పు వచ్చిందని, బీసీ సంఘాలను, బిసిల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని బిసి సంఘాలు క్రిష్ణయ్య పై నిప్పులు చెరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా బిసి లకు సంక్షేమాన్ని అందించాల్సింది పోయి, ఓ పార్టీ అధినేతకు కొమ్ము కాస్తున్నారంటూ ఆయన పై విమర్శలు చేస్తున్నాయి బిసి సంఘాలు. మరికొంతమంది బీసీ నాయకులైతే ఆంధ్రలో బిసి సంఘాన్ని జగన్ కి అమ్మకానికి పెట్టేసారంటూ క్రిష్ణయ్య తీరుపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఇదేం పద్ధతి, ఇదేం పెత్తనం అంటూ ఆయన పై బిసి సంఘ నేతలే బహిరంగంగా విమర్శలు చేశారు. విశాఖలో అయితే కొంతమంది బిసి సంఘం నేతలు ఏకంగా సమావేశం పెట్టి మరీ క్రిష్ణయ్య తీరుపై విమర్శలు చేశారు. తీరు మార్చుకోవాలని క్రిష్ణయ్య ని హెచ్చరించారు. క్రిష్ణయ్య వ్యవహరశైలిలో మార్పు రాకుంటే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామని కూడా వారు ప్రకటించిన పరిస్థితి. మరీ ముఖ్యంగా క్రిష్ణయ్య పూర్తిగా జగన్ ఆధీనంలోకి వెళ్లిపోయారని, జగన్ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారని బీసీ సంఘాల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.