Virat Kohli: టీంతో కలిసి ఆడుతున్నప్పుడు గెలుపు అనేది కేవలం ఒక్కడి చేతిలో ఉండదు. టీంలోని సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేసినప్పుడే టీం విజయాన్ని అందుకుంటుంది. ఈ క్రమంలో కొంతమంది జట్టులో మార్పులను సూచించవచ్చు. టీం ఎలాగైనా గెలవాలని కోరుకునే వారు ఇలాంటి మార్పులు కోరుతుంటారు. అయితే గతంలో కోహ్లీ ఇలాంటి మార్పులనే కోరితే బీసీసీఐ నిరాకరించి, ఇప్పుడు మాత్రం వాటినే పాటించేందుకు సిద్ధమవుతోంది.
టీమిండియా యాంగ్రీ కెప్టెన్ గా పేరున్న విరాట్ కోహ్లీ.. ఎంతో అద్భుతమైన ఆటగాడే అయినా కెప్టెన్ గా మాత్రం ఒక్క ఐసీసీ కప్ ని సొంతం చేసుకోలేదు. అయితే దీనికి సవాలక్ష కారణాలు ఉన్నా కానీ కోహ్లీ మాత్రం పాజిటివ్ గానే తన కెరీర్ ను సాగిస్తున్నాడు. గతంలో సచిన్ చివరి వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు టీమిండియాలోని ప్రతి ఒక్క ప్లేయర్ ప్రాణం పెట్టి ఆడారు. దాంతో టీమిండియా గెలిచింది.
టీమిండియా కెప్టెన్ కూల్ గా ఉన్న ధోని కెప్టెన్సీలో కూడా కోహ్లీతో ప్రతి ఒక్కరు తమ వల్ల ఎంత వీలైతే అంత బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే కోహ్లీ టీం గెలుపు కోసం, ఐసీసీలో కప్ ల కోసం బీసీసీఐకి గతంలో కొన్ని సలహాలు ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్ ఆడే క్రికెటర్లకు మరీ ముఖ్యంగా పేసర్లు ఐపీఎల్ లో గాయాలపాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోహ్లీ గతంలో సూచించాడు. అలాగే క్రికెటర్ల మీద వర్క్ లోడ్ ఎక్కువ కాకుండా మేనేజ్ చేయాలని, దీనిపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలని కోహ్లీ సూచించాడు. అయితే అప్పట్లో గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా కోట్ల రూపాయలు పెట్టి క్రికెటర్లను కొన్న ఫ్రాంచైజీలకు ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలని ఎలా చెబుతాం అంటూ తిరిగి ప్రశ్నించారట.
కానీ గతంలో ఇలా స్పందించిన బీసీసీఐ ఇప్పుడు మాత్రం కోహ్లీ మాటకే జై కొడుతోందట. వరల్డ్ కప్ ఆడే క్రికెటర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుందట. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్సీయే బృందం ఈ ఆటగాళ్లను మానిటర్ చేయాలని, ఐపీఎల్‌లో కూడా సదరు ఆటగాళ్లు గాయాలపాలు అవకుండా వర్క్‌లోడ్ మేనేజ్ చేసేలా ఫ్రాంచైజీలతో మాట్లాడాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన 20 క్రికెటర్లు ఐపీఎల్ వల్ల ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకుంటూ ఫలితం బాగుంటుందని బీసీసీఐ మొత్తానికి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇలా గతంలో కోహ్లీ చేసిన విలువైన సలహాను పక్కన పెట్టిన బీసీసీఐ ఇప్పుడు తన తప్పును తెలుసుకొని.. కోహ్లీ సలహాను పాటించడానికి సిద్ధమైపోయింది.