Munugode By-Poll: వేరే పనుల్లో బిజీగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్.. మునుగోడు ఉప ఎన్నిక టైమింగ్ బీజేపీకి ప్లస్..!

Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైన‌ల్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్.. బీజేపీకి కలిసివచ్చే అంశంగా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం.. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు పనుల్లో బిజీగా ఉండటమే. నవంబర్‌లో మునుగోడు ఉప ఎన్నిక జరిగే చాన్స్ ఉందని బీజేపీ నేత సునీల్ బన్సల్ కొద్ది రోజుల క్రితమే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికపై స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన బీజేపీ.. అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేయడంపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా బీజేపీకి కలిసివచ్చే అంశమనే చెప్పాలి.

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం ప్రస్తుతం కొత్త పార్టీ ఏర్పాటులో నిమగ్నమై ఉంది. అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆయన గత కొద్ది రోజులుగా ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అలాగే జాతీయ పార్టీ ప్రకటన తర్వాత కేసీఆర్.. దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆయన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి సమయం కేటాయిస్తారా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ ఇంకా మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ మునుగోడు టికెట్ కేటాయించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో.. ఓవైపు కొత్త పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న కేసీఆర్.. ఈ ఎన్నికపై కూడా సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఇప్పటికే పాల్వయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే నియోజకవర్గంలో పలు సభలను నిర్వహించింది. అయితే గత కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు.. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎంటర్ కానున్నడంతో.. ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తుది రూట్ మ్యాప్‌ను ఖరారు చేయడం, భద్రతకు పోలీసుల అనుమతి.. తదితర అంశాలపై దృష్టి సారించారు. పాదయాత్రను సమన్వయం చేసుకునేలా మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో జరుగుతున్న రాహుల్ యాత్రను అధ్యయనం చేయడానికి ఓ బృందం కూడా వెళ్లనుంది.

ఈ విధంగా రాహుల్ యాత్రపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేతు.. ఇప్పుడు మునుగోడుపై కూడా పూర్తి ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీకి కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దీంతో ఏ విధంగా చూసిన ఎన్నికల టైమింగ్ మాత్రం ఒకింత బీజేపీకి కలిసివచ్చిందనే టాక్ మాత్రం వినిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -