Munugode By-Poll: మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేలు.. రంగంలోకి ట్రబుల్ షూటర్.. కేసీఆర్ కీలక నిర్ణయం..!

Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నికను.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు.. మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌గా భావిస్తున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికపై ప్రధాన పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. తెలంగాణ ప్రజానీకంలో కూడా.. మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే మనుగోడుపై కేసీఆర్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. ఇప్పటికే మునుగోడు సభ నిర్వహించిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

మంత్రి జగదీష్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచారాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మండలాల వారీగా సామూహిక భోజన కార్యక్రమం కూడా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు పార్టీ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించలేదు. కానీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. బుధవారం ఇందుకు సంబంధించి అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో కొందరు పార్టీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించడంతోనే.. ఆయనను అభ్యర్థిగా ప్రకటించే అంశం ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది.

అలాగే బుధవారం కొత్త పార్టీ ప్రకటించనున్న కేసీఆర్.. ఆ పార్టీ తరఫునే మునుగోడు ఉప ఎన్నికలో బరిలో నిలవాలనే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీ తరఫున మునుగోడులో బోణి కొట్టాలని అనుకుంటున్నారని.. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికపై నేడు కీలక సమావేశం నిర్వహిచిన కేసీఆర్.. ఆ సమావేశానికి హరీష్ రావును కూడా పిలిచారు. మునుగోడులో అనుసరించాల్సిన వ్యుహాంపై జగదీష్ రెడ్డి, కేటీఆర్, హరీష్‌ రావులతో కేసీఆర్ చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబందించి ఇప్పటివరకు హరీష్ రావు పేరు పెద్దగా వినిపించలేదు. అయితే ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావుకే.. మునుగోడు బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతో దసరా తర్వాత నుంచి ఆయన మునుగోడులో మకాం వేసే అవకాశం ఉంది.

అదే సమయంలో 86 మంది ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించనున్నారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా 20 మంది అనుచరులతో.. నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా ప్రచారం చేయనున్నారు. వీరికి ఎప్పటికప్పుడూ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యుహాలపై హరీష్ రావు మార్గనిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ కూడా మునుగోడు విషయంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలు హరీష్ రావుకు ఇచ్చారు. అయితే ఆ రెండు చోట్ల టీఆర్ఎస్ ఓడిపోయింది. అలాగే.. నాగార్జున సాగర్, హుజూర్ నగర్ వంటి ఎన్నికల బాధ్యతలు హరీష్ రావుకు ఇవ్వలేదు. అయితే అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మునుగోడు నియోజకవర్గంలో కూడా హరీష్‌కే బాధ్యతలివ్వాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అనుకూలంగా మార్చగలడని హరీష్ రావుకు పేరున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -