CM KCR: మునుగోడు సభలో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించని కేసీఆర్.. ఆ ఆలోచనే కారణమా?

CM KCR: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. తెలంగాణలోని ప్రధాన పార్టీలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మునుగోడులో ప్రజాదీవెన సభతో టీఆర్ఎస్ ప్రచారానికి సీఎం కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాము ఏం చేశామో చెప్పిన కేసీఆర్.. బీజేపీ గెలిస్తే కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. యుద్దం ఎవరు చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలని కోరారు. అదే సమయంలో ఈడీ తనను ఏం చేయలేదని.. వాటికి దొంగలు భయపడుతారని, తానేందుకు భయపడతానని అన్నారు. అదే సమయంలో మునుగోడుకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కృష్ణ జలాల్లో తెలంగాణ వాటాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ సభ వేదికగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు, విపక్ష పార్టీలు కూడా దీనికోసం ఎదురుచూశాయి. అయితే పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండానే సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే తాను మళ్లీ మునుగోడుకు వస్తానని.. చండూరులో సభ పెట్టుకుందామని మాత్రం చెప్పారు. అయితే కేసీఆర్ వ్యుహాత్మకంగానే అభ్యర్థి ప్రకటన చేయలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందని.. అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందని కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటినుంచే నేతల్లో అసంతృప్తి మంచిదికాదని.. దీనిని విపక్షాలు క్యాష్ చేసుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేసి ఉంటానే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న రోజుల్లో మార్పులను బట్టి కేసీఆర్ అభ్యర్థి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే కేసీఆర్ మునుగోడు సీటు కేటాయిస్తారనే ప్రచారం సాగుతుంది. టీఆర్ఎస్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని కథనం ప్రచురించింది.

అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే.. ఓడిస్తామని అసమ్మతి నేతలు ఇదివరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసినప్పటికీ.. వారిలో అసంతృప్తి తొలగలేదు. అందుకే వారు ప్రత్యేకంగా సమావేశమై.. ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించవద్దని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం కూడా చేశారు.

ఈ నేపథ్యంలోనే మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నవారిలో ఒకరిగా ఉన్న కంచర్ల కృష్ణారెడ్డిని ప్రగతి భవన్‌కు పిలుపించుకున్న కేసీఆర్.. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ ఎవరికిచ్చిన పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో నేడు(ఆగస్టు 20) జరిగిన సభలో టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఈ విషయంలో వేచిచూసే ధోరణని అవలంభించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -