Chiranjeevi: రాజకీయాలకు దూరంగా ఉన్నానని గతంలో ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి.. కానీ చిరంజీవి తమ నాయకుడేనంటోంది కాంగ్రెస్. రాజకీయాలకు దూరంగా ఉన్నా తన నుంచి.. రాజకీయాలు దూరంగా వెళ్లడం లేదన్న చిరంజీవి.. ఇటీవల ఆడియో విడుదల చేశారు. కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవిని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ ఐడీకార్డును జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా ఐడీ కార్డుపై ఉంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. గాడ్ ఫాదర్ మెగా డైలాగ్ ఇప్పుడు తెలుగుస్టేట్స్ ని షేక్ చేస్తోంది. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో ఓ డైలాగ్‌ను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేవలం పదే పది సెకన్ల డైలాగ్. కానీ ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది.
‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు.’ ఇది మెగాస్టార్ డైలాగ్. కానీ దీని వెనుక అంతరార్థం ఏంటనే దానిపై పెద్ద చర్చే మొదలైంది. ప్రమోషన్ కోసమే చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలోని ఈ చిన్న బిట్‌ని శాంపిల్ వదిలారు. కానీ రీల్ డైలాగ్‌ను రేపటి రియల్ పాలిటిక్స్‌కు ఏమైనా సంబంధం ఉందా.. ఇన్‌డైరెక్ట్ గా చిరంజీవి దీనిపై హింట్ ఇచ్చారా లేదంటే.. ఇది ప్రమోషన్ స్టంట్ నే చూడాలా..? ఇప్పుడిలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. లూసిఫర్ రీమేక్ బాక్సాపీస్ని షేక్ చేయబోతున్న ఈ గాడ్ ఫాదర్ దసరా అక్టోబర్ 5న విడుదల కానుంది.