Health Tips: రోజువారి వివిధ పనులు పని ఒత్తిడి ఇంటి గొడవలు తదితరవాటితో భయం పుట్టి గుండె వేగంగా కొట్టుకోవడం, మనస్సు కలత చెందడం, ఇలాంటి ఘటనలు రక్తపోటును విపరీతంగా పెంచేస్తాయని అంటుంటారు. వాస్తవానికి ఈ ఈ రెండింటికీ సంబంధం ఉందా.. తాత్కాలిక ఒత్తిడి శరీరం మీద చూపించే ప్రభావం గురించి చింతించాలా? లేకపోతే దీర్ఘకాల ఒత్తిడే సమస్యలను దారి తీస్తోందా అనే అనుమానాలు తలెత్తుతాయి. కాస్త కోపంగా ప్రవర్తిస్తే చాలు.. బీపీ పెరిగిందని అంటుంటాం. ఒకింత ఒత్తిడికి లోనైనా అదే మాట వల్లె వేస్తుంటాం. నిజానికి దీర్ఘకాలంలో రక్తపోటు పెరగటానికి ఆందోళన, ఒత్తిడి దోహదం చేస్తాయని కచ్చితంగా చెప్పటానికి లేదు. అయితే వీటి ప్రభావంతో మారిపోయే జీవనశైలి మాత్రం అధిక రక్తపోటుకు దారితీస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఒత్తిడి, ఆందోళనలకూ అధిక రక్తపోటు, ఇతర గుండెజబ్బులకూ మధ్య సంబంధం ఉండటం నిజమే కావొచ్చు. కానీ అది మనం ఊహిస్తున్న విధంగా మాత్రం కాదు. ఒత్తిడి, ఆందోళనతో రక్తపోటు పెరిగినా అది అదే పనిగా అధికంగా ఉండకపోవచ్చు. హఠాత్ ఒత్తిడి తాత్కాలికమైంది. పని ఒత్తిడి, గొడవల వంటి ఒత్తిడికి దారితీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తలెత్తుతుంది. ఆకారణంగా భయపడటం, ఆందోళనకు గురికావటం (పానిక్ అటాక్) కూడా దీనికి దారితీయొచ్చు. దీంతో గుండె వేగం పెరగొచ్చు. సింపాడెటిక్ నాడీ వ్యవస్థ వేగం పుంజుకుని రక్తపోటు కూడా పెరగొచ్చు. అయితే ఒత్తిడికి కారణమైన అంశాలు సద్దుమణగగానే రక్తపోటు తగ్గుతుంది. మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇలా ఆయా పరిస్థితులను బట్టి రోజంతా రక్తపోటులో హెచ్చుతగ్గులు రావడం సాధారణమే.
రక్తపోటు మీద దీర్ఘకాల ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది పెద్దగా తెలియదనే చెప్పుకోవచ్చు. కానీ ఇది జీవనశైలి మీద బాగానే ప్రభావం చూపిస్తుంది. జబ్బుల ముప్పు పెరగటానికి దారితీస్తుంది. దీర్ఘకాల ఒత్తిడి నిద్రను చాలా అస్తవ్యస్తం చేస్తుంది. నిద్ర సరిగా పట్టకపోవచ్చు. పట్టినా త్వరగా మెలకువ రావొచ్చు. ఉత్సాహం లేకపోవటం వల్ల వ్యాయామం చేయటానికి విముఖత చూపుతుంటారు. ఒత్తిడికి కారణమయ్యేవి వారాల కొద్దీ కొనసాగుతూ వస్తుంటే చివరికి దీర్ఘకాల ఒత్తిడి కారకాలుగా పరిణమిస్తాయి. వారాలు దాటి నెలలుగా, నెలలు దాటి సంవత్సరాలుగా ఇలా దీర్ఘకాలం వెంటాడుతూనే వస్తుంటాయి. వీటిని మార్చుకోవటం కష్టంగానే తయారవుతుంది. జీవనశైలి మార్పుల ఫలితాలూ అలాగే కొనసాగుతూ వస్తాయి.
ఒత్తిడిని ఎలా పరిగణిస్తాం? ఎలా ఎదుర్కొంటాం? అనేవి చాలా కీలకం. ఒకే పరిస్థితిలో ఇద్దరు వేర్వేరుగా ప్రవర్తించటం చూస్తూనే ఉంటాం. కొందరు తేలికగా తీసుకుంటే, కొందరు తీవ్రంగా ప్రతిస్పందిస్తుంటారు. ఇది ఆయా వ్యక్తుల మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించుకోవడం 70 శాతం వరకు జీవనశైలి మీదే ఆధారపడి ఉంటుంది. మందుల ప్రభావం 30 శాతమే. అందువల్ల జీవనశైలిని మార్చుకోవటం మీద దృష్టి సారించడం అన్నింటికన్నా ఉత్తమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.