IPL 2023: సీఎస్కే-జడ్డూ విభేదాల్లో ధోని జోక్యం.. అదే జరిగితే ఫ్యాన్స్ హ్యాపీ..

IPL 2023: ఐపీఎల్-2023 సీజన్‌ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు ఉప్పు-నిప్పులా ఉన్న రవీంద్ర జడేజా – సీఎస్కే యాజమాన్యం మధ్య విభేదాలు సమసిపోయినట్టే అనిపిస్తున్నది. సీఎస్కే-జడేజా విభేదాలలో టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని జోక్యం చేసుకున్నాడని.. ఈ మాస్టర్ మైండ్ రాకతో జడేజా కూడా తన మనసు మార్చుకున్నాడని తెలుస్తున్నది.

 

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మేరకు.. ఐపీఎల్-16 వేలానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జడేజాతో ధోని ప్రత్యేకంగా మాట్లాడడని, విభేదాలను పక్కనబెట్టి పదేండ్లుగా పనిచేసిన ఫ్రాంచైజీతో కలిసి ఉండాలని అతడికి సూచించినట్టు ఫ్రాంచైజీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఏడాది ఐపీఎల్ తిరిగి హోం అండ్ అవే (ఇంటా బయటా) అనే పద్ధతిలో జరుగనున్న విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో చెన్నైలో జడేజా ప్రాధాన్యం తెలిసిన ధోని.. అతడిని వదులుకుంటే జడ్డూ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని తీసుకురావడం కూడా కష్టమనే అభిప్రాయంతో ఉన్నాడట. ఇదే విషయాన్ని యాజమాన్యంతో చెప్పిన ధోని.. జడేజాతో కూడా మాట్లాడి మ్యాటర్ ను సెటిల్ చేసినట్టు సమాచారం.

 

గతేడాది ఐపీఎల్‌ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు సీఎస్కే సారథిగా ఉన్న ధోని తప్పుకుని ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పజెప్పాడు. కానీ 2022 సీజన్‌లో జడ్డూ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో 8 మ్యాచ్‌ల తర్వాత సీఎస్కే యాజమాన్యం జడేజాను సారథిగా తప్పించి తిరిగి ధోనికే ఆ బాధ్యతలతను అప్పజెప్పింది. అయితే తనను కెప్టెన్‌గా తప్పించినందుకు గాను జడేజా.. సీఎస్కే యాజమాన్యంపై కోపంగా ఉన్నాడని గతంలో వార్తలొచ్చాయి. అంతేగాక జడేజాను గాయం పేరు చెప్పి గత సీజన్ నుంచి తప్పించడం కూడా అతడిని బాధించింది. దీంతో అతడు అప్పట్నుంచి సీఎస్కే వర్గాలతో కూడా టచ్ లో లేడని, సోషల్ మీడియాలో కూడా జడేజా చెన్నై సోషల్ మీడియా పేజీలను అన్‌ఫాలో చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది.

 

ఈ సీజన్ లో జడేజా చెన్నైని వీడటం ఖాయమేనని.. అతడు వేలంలోకి వెళ్లనున్నాడని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ధోని జోక్యంతో అంతా సర్దుకుందని తెలియడంతో చెన్నై ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక డిసెంబర్ 16న బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరుగనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందే ఈనెల 15 వరకు 10 ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే, వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts