CM KCR: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతలపై కేసీఆర్ గురి.. ముఖ్యంగా వారిపైనే..?

CM KCR: జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్.. కొత్త పార్టీ ఏర్పాటుపై బుధవారం కీలక ప్రకటన చేయనున్నారు. కొత్త పార్టీకి సంబంధించి కేసీఆర్.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ చూస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో.. కొత్త పార్టీ విస్తరణను ఏ మేరకు చేపడతారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇందుకు సంబంధించి కేసీఆర్.. ఇప్పటికే ఓ ఆలోచనకు వచ్చారని టీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

2024లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ తన కొత్త పార్టీ తరపున ఏపీలో అభ్యర్థులను నిలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను నిలపనున్నారు. ఎందుకంటే.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా జాతీయ పార్టీ హోదా పొందాలంటే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఏపీలో పలువర్గాల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతకాలం క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ కూడా.. ఈ ప్రయత్నాల్లో భాగమనే చర్చ సాగింది. అయితే ఆ వార్తలను ఉండవల్లి అరుణ్ కుమార్ ఖండించారు. అయితే ప్రస్తుతం మాత్రం ఏపీలోని టీడీపీ నాయకులను కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తాను టీడీపీ ఉన్న సమయంలో కలిసి పనిచేసిన నాయకుల వివరాలను కేసీఆర్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

జగన్‌తో కేసీఆర్‌కు సత్సబంధాలే ఉన్నందున.. టీడీపీ బలంగా ఉన్న సీట్లను ఆయన టార్గెట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ముఖ్యమైన టీడీపీ నేతలను తమ కొత్త పార్టీ వైపు ఆకర్షించి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లపై బరిలో దింపాలని చూస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలను కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

మరోవైపు సామాజిక సమీకరణాలు, ఇతర కారణాల వల్ల టీడీపీలో టికెట్లు దక్కనివారిని, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముఖ్య నేతల వివరాలు కూడా కేసీఆర్ సేకరించారని.. తన కొత్త పార్టీలో చేరాలని కోరుతూ వారికి ఆహ్వానాలు కూడా పంపారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధానంగా కొప్పుల వెలమ, రాజు, కాపు సామాజికవర్గాలను తన జాతీయ పార్టీ వైపు తిప్పుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత యోచిస్తున్నట్లు సమాచారం.

గతంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీలోనూ టీఆర్ఎస్‌ను పోటీ చేయమని అడుగుతున్నారని చెప్పారు. మరోవైపు పలు సందర్భాల్లో కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ఏపీలో పలుచోట్ల ఫ్లెక్సీలు కూడా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఏపీ నేతల నుంచి మద్దతు లభించే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇందుకోసం గులాబీ పార్టీ ముఖ్యనేతలు కూడా వారి వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. మరి కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -