King Kohli: భారత క్రికెట్ అభిమానులకు దీపావళి కాస్త ముందుగానే మొదలైంది. ఆదివారం ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 18 బంతుల్లో 48 పరుగులు చేయాలి. పాక్ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ గెలుస్తుందని అసలు ఎవరూ ఊహించి ఉండరు. కానీ అందరి మదిలో ఒక్కటే ఆశ. క్రీజ్‌లో కోహ్లీ చివరి వరకు నిలబడాలి. అప్పుడే భారత్ గెలుస్తుంది. సినిమాల్లో చూసిన విధంగా చివరి మూడు ఓవర్లలో కోహ్లీ భారత్‌కు అండగా నిలిచాడు. అప్పటికే పాండ్యాతో క్రీజులో ఉన్న కోహ్లీ.. చివరి ఓవర్లో మునపటి కోహ్లీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆఖరి మూడు ఓవర్లలో కోహ్లీ బ్యాటింగ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
నరాలు తెగెలా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్ ఆడిన కోహ్లీ.. టీమ్ ఇండియాకు విజయం కట్టబెట్టాడు. ఆ క్షణం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో కోహ్లీ పేరు మార్మోగింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఇండియా భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.
ఫామ్‌లో లేడని తనను అవమానించిన ప్రతిఒక్కరూ నోరు మూసుకునేలా.. కింగ్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాడు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు ‘కోహ్లీ ఈజ్ బ్యాక్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్ తనకు ఎంతో ప్రత్యేకమైనది కోహ్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంట్వర్యూలో ఎమోషనల్‌గా మాట్లాడాడు. అయితే ఈ మ్యాచ్ నిజంగానే కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ రెండు ఐసీసీ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. ఐసీసీ టోర్నమెంట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ (23) రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. కోహ్లీ (24) హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ రికార్డును కూడా క్రాస్ చేసేశాడు. రోహిత్ శర్మ 143 ఇన్నింగ్స్ లో 3,741 పరుగులు చేయగా.. కోహ్లీ 110 ఇన్నింగ్స్ లోనే 3,794 పరుగులు చేశాడు.