Kodali Nani: హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించని కొడాలి నాని.. ఆయనపై జగన్ అసంతృప్తితో ఉన్నారా?

Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ వర్సీటీ పేరు మార్పు పెను సంచలనమే రేపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకనున్న ఈ నిర్ణయాన్ని అధికార వైసీపీ నేతలు మినహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని ప్రతిపక్షాలు, ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హెల్త్ వర్సిటీ పేరు మార్పు సరైనది కాదని అన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని అంటున్నారు. అయితే బయటపడకపోయినప్పటికీ.. వైసీపీలోని కొందరు నేతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్‌పై అభిమానం ఉన్న నేతలు ఈ జాబితాలో ఉన్నారని చెబుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి, వైసీపీకి మద్దతుగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ఎన్టీఆర్‌ అంటే అమితమైన ఇష్టం. వీరు ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులనే పేరు ఉంది. ఇందులో వల్లభనేని వంశీ ఇప్పటికే హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఖండిచకపోయినప్పటికీ.. ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలంటూ వంశీ విజ్ఞప్తి చేశారు.

కానీ కొడాలి నాని మాత్రం ఇప్పటివరకు మీడియా ముందు ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. అవకాశం దొరికనప్పుడల్లా సీనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించే కొడాలి నాని.. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లపై మాత్రం తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ ఉంటారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. వైసీపీ అధిష్టానం ఆదేశాలు, ఆయనకు వారిపై ఉన్న వ్యక్తిగత ద్వేషం కారణంగానే కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమని రాజకీయ వర్గాల్లో వినిపిచ్చే మాట. ఏది ఏమైనా ఇవన్నీ జగన్ మనసు గెలుచుకోవడానికేనని.. కొడాలి నాని మనసు గెలుచుకోవడానికి ఉపయోగపడ్డాయనే చెప్పాలి.

అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో.. కొడాలి నానికి జగన్ మరోమారు అవకాశం కల్పించలేదు. అయితే అప్పుడే ఆయన అసంతృప్తి చెందారనే వార్తలు వచ్చిన నాని వాటిని ఖండించారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏ రకంగా స్పందించాలనే దానిపై నాని తర్జనభర్జన పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడితే.. ఎన్టీఆర్ అభిమానులు కొంతమేర ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొంతకాలంగా వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వంపై వైఎస్ జగన్ నిర్వహించిన వర్క్ షాపుకు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలు గైర్హాజరు కావడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో అసంతృప్తిగా ఉన్న కొడాలి నాని.. ఈ వర్క్‌షాపుకు హాజరుకాలేదనే ప్రచారం జరిగింది. దాని మీద కూడా నాని ఇంతవరకు స్పందించలేదు.

అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించాలని, టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలని.. మిగిలిన పార్టీ నాయకుల మాదిరిగానే కొడాలి నానికి కూడా పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ.. కానీ స్పందించడానికి నిరాకరించారనే ప్రచారం సాగుతుంది. ఈ విషయంలో ఆయన సీఎం జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారని.. అదే సమయంలో కొడాలి వైఖరి పట్ల జగన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంపై కొడాలి నాని స్పందిస్తేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -