LB Sriram: సినిమాలకు దూరంగా ఎల్‌బీ శ్రీరాం.. ఇండస్ట్రీకి దూరమవ్వడానికి అదే కారణమా..?

LB Sriram: కొందరు నటులు తెరపై కదిలే పాత్రలకు తమ అద్భుతమైన నటనా కౌశల్యంతో ప్రాణాలు పోస్తారు. వారి నటనా ప్రతిభకు మంత్రముగ్ధులై సినిమాను చూస్తూ ఉంటామంతే. అలాంటి అరుదైన నటుల్లో సీనియర్ యాక్టర్ ఎల్‌బీ శ్రీరాం ఒకరు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని వందల సినిమాల్లో ఆయన నటించి, మెప్పించారు. ముఖ్యంగా ఆయన చేసే సెటైరికల్ కామెడీ, గోదావరి యాసకు ఎవ్వరికైనా నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే.

అలాంటి ఎల్‌బీ శ్రీరాం చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన ఎందుకు చిత్ర రంగానికి దూరంగా ఉంటున్నారనేది మాత్రం తెలియరాలేదు. తాజాగా ఈ అంశంపై ఎల్‌బీ శ్రీరాం పెదవి విప్పారు. హాస్య నటుడి ఇమేజ్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే సినిమాలకు స్వస్తి చెప్పానని ఆయన స్పష్టం చేశారు.

నచ్చకపోతే ఏదైనా వదులుకుంటా..
‘నాకు నచ్చనిది అది ఏదైనా సరే నిక్కచ్చిగా వదులుకుంటా. నచ్చిన చోటే పూర్తి సంతృప్తిగా జీవిస్తా. ఇది నేను పెట్టుకున్న, ఆచరిస్తున్న నియమం. పదేళ్లపాటు సినీ నటుడిగా ఎన్నో హాస్య, సందేశాత్మక చిత్రాల్లో నటించా. అక్కడ మంచి క్యారెక్టర్లు చేసి సంతృప్తి చెందా. కానీ హాస్య పాత్రల నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే సినిమాలకు స్వస్తి చెప్పా. ఆ తర్వాత నుంచి సామాజిక సందేశాలిచ్చే లఘు చిత్రాల రూపకల్పన, నిర్మాణాలపైనే దృష్టి పెట్టా’ అని ఎల్‌బీ శ్రీరాం చెప్పుకొచ్చారు.

అమలాపురంలో అమర గాయకుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఘంటసాల విగ్రహాన్ని ఎల్‌బీ శ్రీరామ్‌ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈలోగా ఆయన తన మనోగతాన్ని విలేకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. తమ సొంతూరు కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరు అగ్రహారం అని ఆయన తెలిపారు. ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడైన తాను 23 ఏళ్ల కిందట సినీ అవకాశాలను అన్వేషించుకుంటూ చిత్ర పరిశ్రమకు వెళ్లానని శ్రీరామ్‌ పేర్కొన్నారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆరిస్ట్‌గా తనను చిత్ర పరిశ్రమ గుర్తించిందన్నారు. ఈ ఒరవడిలోనే ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రంలో నటన ద్వారా పరిశ్రమ తనలో కొత్త నటుడిని చూసిందని శ్రీరామ్‌ వివరించారు. ఇప్పటి వరకూ 500 పైచిలుకు సినిమాల్లో యాక్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.

ఆరేళ్లలో 60 లఘు చిత్రాలు..
ఆరేళ్ల నుంచి తాను పావుగంట సమయంలో సందేశాత్మకతను అందించే షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణంపై దృష్టి పెట్టానని ఎల్‌బీ శ్రీరామ్‌ తెలిపారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నానని అన్నారు. హాస్య నటుడి ముద్ర నుంచి బయట పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ ఆరేళ్లలో 60 లఘు చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించి దర్శకత్వం వహించానని పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -