Nani Movies: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన సినిమాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో నాని అలాగే ఉంటాడు. కాదు అలాగే నటిస్తాడని చెప్పాలి. అందుకే అభిమానులు అతడికి నేచురల్ స్టార్ అనే బిరుదు ఇచ్చేశారు. కానీ నాని తన బలాన్ని వదిలేసి మధ్యలో కొన్ని ప్రయోగాలు చేశాడు. కానీ అవన్నీ మిస్ ఫైర్ అయ్యాయి. ముఖ్యంగా వి సినిమాలో విలన్‌గా నటించాడు. అయితే ఆ సినిమాలో నాని నటన బాగున్నా ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి పెదవి విరిచారు. నానికి ఇలాంటి రోల్స్ సెట్ కావని పరోక్షంగా స్పష్టం చేశారు.
కానీ నాని మాత్రం తన ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. గ్యాంగ్ లీడర్, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి అంటూ వరుసగా ప్రయోగాలే చేసుకుంటూ పోతున్నాడు. వీటిలో శ్యామ్ సింగరాయ్ తప్పితే మిగతా సినిమాలన్నీ దారుణ ఫలితాలను మూటగట్టుకున్నాయి. శ్యామ్ సింగరాయ్ కూడా సాయిపల్లవి నటన వల్ల ఆడిందనే రూమర్ ఉంది. దీంతో నాని మళ్లీ తన బలాన్ని నమ్ముకుని దసరా అనే సినిమాను చేస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే నాని కెరీర్ మటాష్ అవుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో దసరా సినిమాపై నాని గంపెడాశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ను శ్రీలక్ష్మీవెంకటేశ్వర బ్యానరుపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.
ఇటు హీరోగా.. అటు నిర్మాతగా
ఒక పక్క హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాతగానూ నాని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గతంలో అ, హిట్-1 సినిమాలను నిర్మించిన నాని ఇప్పుడు హిట్-2 సినిమాతో నిర్మాతగా మూడో అడుగు వేశాడు. ఈ సినిమాకు తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. సినిమాలతో పాటు నాని వెబ్ సిరీస్‌లలోనూ అడుగుపెట్టాడు. ఇటీవల మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ నిర్మించగా ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.