Narendra Modi: ఈ నెల 11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. మునుగోడుపై బీజేపీ నేతలకు ఏమైనా చెబుతారా..?

Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 11వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. హెచ్‌ఐసీసీలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్(United Nations World Geospatial Information Congress) సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఆ వేదికపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును యూఎన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈనెల 10 నుంచి 14 వరకు ఈ సదస్సు జరగనుంది. అయితే అధికార పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్న మోదీ.. బీజేపీ నేతలతో భేటీ అవుతారా? అనే దానిపై క్లారిటీ లేదు.

అయితే బీజేపీ వర్గాల నుంచి సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ అధికార పర్యటన మీద వస్తున్నప్పటికీ.. హైదరాబాద్ చేరుకున్నాక ఎయిరపోర్ట్‌లో పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే పార్టీ నేతలతో ప్రత్యేకంగా హోటల్‌లో సమావేశం అయ్యే చాన్స్ కూడా ఉందంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ ప్రధాని హైదరాబాద్ పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైతే.. మునుగోడుపై పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు మరింత ఉత్సహంతో ముందుకు సాగే అవకాశం ఉంది.

ఎందుకంటే రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు ప్రణాళికలను బీజేపీ అధిష్టానం సిద్దం చేస్తుంది. వరుసగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనలకు వస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. నేరుగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడులో ఏర్పాటు చేసిన సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అమిత్ షా.. ఆ తర్వాత ఓ హోటల్‌లో బీజేపీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా మునుగోడుపై పార్టీ శ్రేణులుకు అమిత్ షా.. మార్గనిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. నేతలు తీరు మార్చుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఇక, ఇటీవల తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా నియమితులైన సునీల్ బన్సల్ పూర్తిగా మునుగోడు ఉప ఎన్నికపైన దృష్టి సారించారు. ఆ మేరకు మునుగోడు ఉప ఎన్నికపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ సభ్యులతో పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మోదీ హైదరాబాద్ పర్యటన కూడా పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎలాగైనా మోదీ హైదరాబాద్ పర్యటన సమయంలో.. రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేలా కొందరు ముఖ్యనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మోదీ పర్యటన ఎలా సాగనుందో.. పర్యటనకు సంబంధించిన తుదిషెడ్యూల్ వచ్చాకే క్లారిటీ రానుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -