IPL: ఐపీఎల్‌కు పంత్ దూరం.. వార్నర్‌పై డీసీ కన్ను

IPL: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ రిషబ్ పంత్ ఈ ఏడాదంతా క్రికెట్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు కూడా అతడు దూరం కానున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది. తాజా సమాచారం ప్రకారం పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించాలని డీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే ఢిల్లీ యాజమాన్యం ప్రకటించే అవకాశం ఉంది.

 

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాకుండా వార్నర్ తన చాతుర్యంతో ఆ జట్టును విజేతగా కూడా నిలిపాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్‌పై దృష్టి సారించినట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2015 నుంచి 2017 వరకు సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్.. బాల్ ట్యాపరింగ్ వివాదం కారణంగా 2018లో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2020లో తిరిగి వార్నర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన ఆరెంజ్ ఆర్మీ.. 2021 సీజన్ మధ్యలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.

 

అయితే ఐపీఎల్‌కు పంత్ దూరం కావడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద దెబ్బ అని భావించొచ్చు. అతడు జట్టు కెప్టెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ విలువైన సేవలను అందించేవాడు. పరిస్థితులకు అనుగుణంగా ఏ స్థానంలోనైనా పంత్ బ్యాటింగ్ చేయగలడు. దీంతో తమకు మిడిలార్డర్‌లో పంత్ లాంటి ఆటగాడు అవసరమని ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

ఢిల్లీ వికెట్ కీపర్ ఎవరు?
పంత్ దూరం కావడంతో అతడి స్థానంలో వార్నర్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ విషయంలో మాత్రం తర్జన భర్జనలు పడుతోంది. పంత్ స్థానంలో దేశీయ వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలా లేదా ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన ఫిల్ సాల్ట్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించాలా అన్న విషయంపై సమాలోచనలు చేస్తోంది. అయితే ప్లేయింగ్ 11లో గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలన్న నిబంధన కారణంగా సర్ఫరాజ్ ఖాన్‌ వైపే డీసీ మొగ్గు చూపే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్ల కోటాలో వార్నర్, మిచెల్ మార్ష్, నోర్జ్, ముస్తాఫిజుర్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -