Sachin Pilot: రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో మరోసారి రచ్చ.. అశోక్ గెహ్లాట్‌ను పూర్తిగా టార్గెట్ చేసిన సచిన్ పైలెట్..

Sachin Pilot: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపేందుకు భారత్ జోడో యాత్ర చేస్తుంటే.. పార్టీని మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద సమస్య పార్టీలోనే గ్రూపుల మధ్య అధిపత్య పోరేనని చెప్పాలి. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వీటిని తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఫలితం రావడం లేదు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓవైపు ప్రతిపక్ష బీజేపీ నుంచి పోరు.. మరోవైపు స్వపక్షంలోనే గ్రూప్ రాజకీయాలు కాంగ్రెష్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ కేంద్రాలుగా సాగుతున్న గ్రూప్ రాజకీయాలే ఇందుకు కారణం.

 

తాజాగా ఈ రచ్చ మరోసారి కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని వారాల క్రితం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలు గురించి తెలిసిందే. అయితే అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే.. తాను సీఎం పీఠం మీద కూర్చొవచ్చని సచిన్ పైలెట్ ఆశపడ్డారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్దపడిన గెహ్లాట్.. రాజస్తాన్ సీఎంగా ఉండేందుకే సుముఖత కనబరిచారు. ఈ క్రమంలోనే అశోక్ గెహ్లాట్‌ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది.

 

 

అయితే తాజాగా ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చిన సచిన్ పైలెట్.. రాజస్థాన్‌లో ఇటీవలి రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నూతన మల్లికార్జున్ ఖర్గేను కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 నెలలు మాత్రమే మిగిలి ఉందని.. పార్టీ నియమాలు, క్రమశిక్షణ అందరికీ వర్తిస్తుందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.

అలాగే.. అశోక్ గెహ్లాట్‌ను ఉద్దేశించి కూడా సచిన్ పైలెట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారని పైలట్ చెప్పారు. ఇది ఆసక్తికరంగా ఉందని.. దీనిని తేలిగ్గా తీసుకోవద్దని అన్నారు. గతంలోనూ ప్రధానమంత్రి మోడీ.. గులాం నబీ ఆజాద్‌ను పార్లమెంటులో ప్రశసించారని.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని కామెంట్ చేశారు. ఈ విధమైన కామెంట్స్ ద్వారా సచిన్ పైలెట్ మరోసారి అశోక్ గెహ్లాట్‌న పూర్తిగా టార్గెట్ చేశారు. అయితే సచిన్ పైలెట్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దీంతో రాజస్తాన్ కాంగ్రెస్‌లో మరోసారి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్న నాయకులు, కార్యకర్తలను మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది సమయమే ఉందని.. రాష్ట్రంలో పార్టీ విషయాలపై అధిష్టానం ఫోకస్ పెట్టాలని వారు కోరుతున్నారు. గెహ్లాట్, పైలెట్ వర్గాల మధ్య వర్గపోరు ఇలాగే కొనసాగితే.. పార్టీ రాజస్తాన్‌లో కూడా అధికారం కోల్పోక తప్పదని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts