Revanth Reddy: మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ ఉపఎన్నికపై ఇప్పటికే దృష్టి పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం మొదలుపెట్టాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ లోపే పార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నికల హిట్ ను పెంచేశాయి. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగా.. మునుగోడు ఉపఎన్నిక పోరుతో తెలంగాణలో ఇప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహరచనలు చేస్తన్నాయి. ఎత్తుక పై ఎత్తులు వేస్తున్నాయి పార్టీలన్నీ.
ఇక మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మునుగోడుపై మరింత స్పీడ్ పెంచారు. మునుగోడులో రంగంలోకి దిగి దూకుడుగా వ్యవహరించారు. తాజాగా మునుగోడులో ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి క్యాడర్ లో మరింత జోష్ ను పెంచారు. అధికార టీఆర్ఎస్ పై విమర్శల దాడితో మునుగోడు రాజకీయాలను హీటెక్కించారు. కానీ మునుగోడు ప్రచారం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తమపై ఉన్న ఆరోపణలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రత్యర్థుల కామెంట్లకు దీటైన సమాధానం ఇచ్చిన తనపై వచ్చే ఆరోపణలకు చెక్ పెట్టారు.
రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ ఉండగా.. ఆ పార్టీ నుంచి గత ఎన్నికలకు ముందు బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. అయితే టీడీపీ నుంచి బయటకు వస్తూ ఆ పార్టీని రేవంత్ విమర్శించేలేదు. దీంతో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చంద్రబాబే స్వయంగా పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు సూచనతోనే రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరాలనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ లో రేవంత్ ను విమర్శించే నేతలు కూడా ఆయన చంద్రబాబు మనిషి అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే టీడీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత రేవంత్ చంద్రబాబును ఒక్కమాట కూడా అనలేదు.
చంద్రబాబు టాపిక్ వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటారు. దీంతో తెలంగాణలోని టీడీపీ క్యాడర్ కూడా రేవంత్ కు మద్దతిస్తూ ఉంటారు. అయితే ఇటీవల తెలంగాణలోని టీడీపీ క్యాడర్ ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వెనుక కూడా తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను ఆకట్టుకునే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో మునుగోడు ప్రచారంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను చూస్తే బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ లో తాను పుట్టకపోయినప్పటికీ కోడలిగా వచ్చానంటూ వ్యాఖ్యానించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే తాను వచ్చానంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి వెళ్లి టీడీపీ గౌరవాన్ని నిలబెట్టారని రేవంత్ చెప్పారు. టీడీపీ ఓటర్లు బీజేపీ వైపు వెళ్లకుండా హైజాక్ చేసే ప్రయత్నం రేవంత్ చేశారనే చర్చ జరుగుతోంది.
కాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఇక్కడ టీడీపీకి ఉన్న ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే చంద్రబాబును మళ్లీ దగ్గరకు తీసుకోవాలని చూస్తోంది. అవసరమైతే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాటి తరుణంలో టీడీపీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ వేశారని, అందులో భాగంగానే ఈ కామెంట్లు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.