Sanju Samson: పదే పదే విఫలమవుతున్న పంత్.. శాంసన్‌ను ఎందుకు పక్కనబెడుతున్నట్టు..?

Sanju Samson: టీమిండియాలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారా..? అంటే బహుశా అది కేరళ కుర్రాడు సంజూ శాంసనేనేమో. చాలాకాలంగా దేశవాళీతో పాటు ఐపీఎల్‌లో కూడా రాణిస్తున్న శాంసన్‌ను సెలక్టర్లు పదే పదే ఇగ్నోర్ చేస్తూ అతడి కెరీర్ ను నాశనం చేస్తున్నారనేది టీమిండియా అభిమానుల వాదన. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సంజూకు చోటివ్వని సెలక్టర్లు.. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ తో జట్టుకు ఎంపిక చేసి మరీ బెంచ్ కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సంజూ చేసిన తప్పేంటని బీసీసీఐని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.

 

ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. సీనియర్లకు విరామమివ్వడంతో ఈ సిరీస్ లో అయినా సంజూకు ఛాన్స్ వస్తుందేమోనని ఫ్యాన్స్ భావించారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని మరోసారి పక్కనబెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండు, మూడు మ్యాచ్ లలో శాంసన్ ను బెంచ్‌కే పరిమితం చేశారు. దీంతో అతడి అభిమానులతో పాటు శాంసన్ ప్రతిభను గుర్తించిన చాలా మంది ఇది ఒక యువ ఆటగాడి కెరీర్ ను నాశనం చేయడమేనని వాదిస్తున్నారు.

 

ఇదే విషయమై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ‘మీరు (బీసీసీఐ) అతడికి అవకాశాలివ్వకుంటే కనీసం బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో అయినా ఆడేందుకు ఛాన్స్ ఇవ్వండి. అంతేగానీ అతడి కెరీర్ ను నాశనం చెయ్యకండి.. పంత్, ఇషాన్, హుడాల కంటే సంజూ శాంసన్ చాలా రెట్లు మెరుగైన ఆటగాడు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

ఈ సిరీస్ లో రోహిత్-రాహుల్ లకు రెస్ట్ ఇవ్వడంతో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్ – రిషభ్ పంత్ లను పంపించింది టీమిండియా. అయితే టెస్టు, వన్డేలతో పోలిస్తే టీ20లలో పంత్ కు గొప్ప రికార్డేమీ లేదు. అయినా అతడికి పదే పదే అవకాశాలిస్తున్నది. కానీ పంత్ మాత్రం వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. కివీస్ తో సిరీస్ లో పంత్.. రెండు మ్యాచ్ లలో 17 (11, 6) పరుగులు మాత్రమే చేశాడు. పంత్ తో పోలిస్తే శాంసన్ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తాడు. అయినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని బెంచ్ కే పరిమితం చేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. న్యూజిలాండ్ తో రెండు మ్యాచ్ లలో సంజూ ఫ్యాన్స్ ‘వీ వాంట్ సంజూ’ అని బ్యానర్లు ప్రదర్శిస్తూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts