Bramhamgari Jeevitha Charitra: నందమూరి తారక రామారావు తెలుగు చలనచిత్ర సుప్రసిద్ధ నటుడిగా అందరికీ సుపరిచితమే. ఒక గొప్ప ప్రజానాయకుడు. తెలుగువారు ఈయనను అన్నగారు అని అభిమానంతో పిలుచుకుంటారు. ఈయన దాదాపు 400 చిత్రాలలో నటించడం జరిగింది. ఎన్టీఆర్ గారు నటించిన చిత్రాలలో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు.
ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ గారు రచయిత కొండవీటి వెంకటకవిని పిలిపించి తనకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను సినిమా చేయాలని ఎప్పటినుండో కోరిక ఉందని చెప్పారు. ఇద్దరు కలిసి బ్రహ్మంగారి మఠం వెళ్లి 14 రోజులు అక్కడే ఉండి బ్రహ్మంగారి చరిత్రను తెలుసుకొని కవి గారితో కథ ఎలా ఉండాలో వివరించారట.
కవి గారు కథ రాయడం ప్రారంభించారు. ఇంతలో సన్నిహితులకు ఈ విషయం తెలిసి బ్రహ్మంగారి జీవిత చరిత్రను సినిమా తీయడం అంటే కీడు అని భావించి, ఎన్టీఆర్ గారిని వద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మంగారి జీవిత చరిత్రను సినిమాగా చేయాలని ఇంతకుముందే ఐదారు మంది ప్రయత్నించారు. మొదటిలోనే విరమించుకోవలసి వచ్చింది అని ఎన్టీఆర్ గారికి నచ్చజెప్పారట.
ఎవరు చెప్పినా ఎన్టీఆర్ గారు వినకుండా 1980 లో రామకృష్ణ సినీ స్టూడియో పథకంపై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టారు. బ్రహ్మంగారు తిరుగాడిన అహోబిలం, కంది మల్లయ్య పల్లె ప్రాంతాలలో షూటింగ్ చిత్రీకరించారు. అలాగే ముమ్మిడివరం బాలయోగి మందిరం వద్ద షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే.
ఈ చిత్రంలో క్లైమాక్స్ కు చాలా ప్రాముఖ్యత ఉండడంతో సిద్దయ్య పాత్రలో బాలకృష్ణ నటించారు. సినిమా షూటింగ్ సమయంలో కొందరు కార్మికులు సహజంగానే చనిపోతే, ఈ చిత్రం కారణంగా చనిపోయారని చెడు ప్రచారం జరిగింది. అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాలో యోగివేమన సన్నివేశాన్ని మార్చాలని చెబితే అందుకు ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో మూడు సంవత్సరాల వరకు విడుదలకు నోచుకోలేదు ఈ చిత్రం.
తరువాత న్యాయస్థానం ఎన్టీఆర్ వైపే ఉండడంతో 1984లో ఈ చిత్రం 50 కేంద్రాలలో విడుదలై సినీ చరిత్రలో ఎన్నడూ ఎరుగని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఎంతమంది నివారించిన, ఎన్ని సమస్యలు తలెత్తిన చివరికి చిత్రం పూర్తిచేసి, ఆ చిత్రాన్ని విడుదల చేశారంటే అది ఆయన పట్టుదలకు నిదర్శనం.