T20: క్రికెట్ ప్రేక్షకులకు మళ్లీ నిరాశ.. తొలి టీ20 వర్షార్ఫణం

T20: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే ఓటమి చెంది ఇంటి దారి పట్టిన టీమిండియా అక్కడి నుంచి న్యూజిలాండ్‌కు చేరుకుంది. అక్కడ మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా తలపడాల్సి ఉంది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 జరగాలి. కానీ వరుణుడు అడ్డుపడటంతో ఈ మ్యాచ్‌ను ఒక్కబంతి కూడా పడకుండానే అంపైర్లు రద్దు చేశారు. కనీసం టాస్ వేసేందుకు కూడా వర్షం సహకరించలేదు. దీంతో స్టేడియానికి తరలివచ్చిన ప్రేక్షకులు నిరాశగా వెనుతిరిగారు.

 

టీమిండియాతో పాటు న్యూజిలాండ్ కూడా సెమీస్‌లోనే వెనుతిరగడంతో టీ20 సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. గత న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా గట్టి పోటీ ఇవ్వడంతో రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ వరకు వెళ్లాయి. ఈ మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. మళ్లీ అలాంటి మ్యాచ్‌లు జరుగుతాయని అభిమానులు కూడా భావించారు. కానీ వరుణుడి రూపంలో మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది.

 

అయితే ఈ మ్యాచ్ రద్దు కావడంతో అందరి కంటే ఎక్కువగా అమెజాన్ సంస్థ నిర్వాహకులు బాధపడ్డారు. ఎందుకంటే ఈ సిరీస్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. తొలిసారి టీమిండియా టూర్ మ్యాచ్‌ల రైట్స్ దక్కించుకోవడంతో ఈ సిరీస్‌పై అమెజాన్ భారీగా ప్రమోట్ చేసింది. హాట్ స్టార్‌కు అలవాటు పడిన అభిమానులు సైతం అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకొని ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్దమయ్యారు.

 

మిగతా రెండు మ్యాచ్‌ల సంగతేంటి?
ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లకు అడ్డుపడిన వరుణుడు భారత్-న్యూజిలాండ్ సిరీస్‌ను చూసేందుకు కూడా తరలివచ్చాడు. దీంతో రామేశ్వరం పోయినా.. శనేశ్వరం తప్పలేదని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ అనగానే వరుణుడికి మూడ్ వస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. కొందరు అభిమానులు అయితే కోహ్లీ, రోహిత్ ఈ సిరీస్‌లో లేకపోవడంతో లైట్ తీసుకున్నామని, మ్యాచ్‌లు రద్దయినా నష్టం లేదని అభిప్రాయపడుతున్నారు. మరి మిగతా రెండు మ్యాచ్‌లన్నా సవ్యంగా సాగుతాయో లేదో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: మేకబోతు గాంభీర్యంతో జగన్ ఎన్నికల పోరు.. సర్వేలను కొంటే సరిపోతుందా?

CM Jagan: త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కావడంతో ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్ కూడా దాఖలు చేశారు....
- Advertisement -
- Advertisement -