T20 World Cup 2022: ‘మేము ఇండియాను ఫైనల్ కు వెళ్లనివ్వం. ఫైనల్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనివ్వం..’ అని ఇండియాతో సెమీస్ కు ముందు చెప్పిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నంత పని చేశాడు. భారత క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాకులిస్తూ.. పదిహేనేండ్ల తర్వాత అయినా టీ20 ప్రపంచకప్ టోర్నీని నెగ్గాలని ఆస్ట్రేలియాకు పయనమైన భారత క్రికెట్ జట్టు కథను సెమీఫైనల్ లోనే ముగించాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం అడిలైడ్ వేదికగా ముగిసిన సెమీఫైనల్స్ లో భారత్ పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్ లో దారుణంగా విఫలమైన ఇండియా భారీ మూల్యం చెల్లించుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో కెఎల్ రాహుల్ (5) మరోసారి విఫలమవ్వగా.. రోహిత్ (27), సూర్యకుమార్ యాదవ్ (14) నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ , హార్ధిక్ పాండ్యా ఫర్వాలేదనిపించారు. ఫలితంగా భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా వీరబాదుడు బాదింది. కెప్టెన్ జోస్ బట్లర్ (80 నాటౌట్), అలెక్స్ హేల్స్ (86 నాటౌట్) లు 16 ఓవర్లలో 170 పరుగులు జోడించి ఇంగ్లీష్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. భారత బౌలర్లు దారుణంగా తేలిపోయారు. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ విజయంతో ఇంగ్లాండ్.. ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఫైనల్స్ లో ఆ జట్టు పాకిస్తాన్ తో తలపడుతుంది.
ఇంగ్లాండ్ – పాకిస్తాన్ లు 1992 వన్డే ప్రపంచకప్ లో పోటీ పడ్డాయి. ఇదే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టోర్నీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్.. తమ తొలి ప్రపంచకప్ ను గెలుచుకుంది. మరి 13న జరిగే ఫైనల్స్ లో చరిత్ర పునరావృతమవుతుందా..? లేక ఇంగ్లాండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుస్తుందా..? అనేది తేలాల్సి ఉంది.