T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భీకరమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. బౌలర్ ఎవరు..? పిచ్ ఎలా ఉంది..? అనేది చూడకుండా వీరవిహారం చేస్తున్నాడు. ఆఫ్ సైడ్ కు ఆవలగా వెళ్తున్న బంతులను లెగ్ సైడ్‌లో ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లకు ‘ఈయనకు బౌలింగ్ ఎక్కడ వేయాల్రా దేవుడా..?’అని తలలు పట్టుకునేలా చేస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో వీరవిహారం చేస్తున్న సూర్య ఆటపై ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్, ఆల్ రౌండర్ మోయిన్ అలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. రేపు (గురువారం) ఇండియాతో జరుగబోయే సెమీస్ లో సూర్య తన బౌలింగ్ లో అలా ఆడకుంటే ఉంటే అదే పదివేలని వేడుకుంటున్నాడు.
మోయిన్ అలీ భయానికి కారణముంది. ఈ ఏడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ టూర్ లో ఇండియా.. ఇంగ్లాండ్ తో మూడు టీ20లు ఆడింది. మూడో మ్యాచ్ లో సూర్య.. సెంచరీతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్ లో నయా 360.. 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు.
టీ20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ కు ముందు అలీ ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో సూర్య తన బౌలింగ్ ను చావగొట్టాడని, లక్కీగా అతడు అలిసిపోవడం వల్ల తాను బతికిపోయానని, లేకుంటే ఆ విధ్వంసం తలుచుకుంటేనే భయంగా ఉందని చెప్పాడు.
ఇండియాతో మ్యాచ్ కు ముందు అలీ మాట్లాడుతూ.. ‘ఆ మ్యాచ్ లో సూర్య నన్ను (బౌలింగ్ ను) మర్డర్ చేసినంత పని చేశాడు. అప్పటికీ ఇంకా ఇండియా గెలవడానికి అవకాశం లేకున్నా ఆ మ్యాచ్ లో సూర్య ఒంటరిగా పోరాడాడు. దాదాపు తమ జట్టును విజయానికి దగ్గరగా చేర్చాడు. కానీ దేవుడి దయ వల్ల అతడు అలసిపోయి నా బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. లేకుంటే నేను కూడా మిగతా బౌలర్ల మాదిరే బాధపడేవాడిని. ఆ మ్యాచ్ లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతం..’ అని కొనియాడాడు. సూర్య టీ20 క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లాడని అలీ ప్రశంసలు కురిపించాడు.