Kohli: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 159/8 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించుకున్నారు. ఇక 160 పరుగుల లక్ష్యానికి 6 వికెట్లు నష్టపోయిన భారత్ చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ను ఛేదించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులు చేశాడు. రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ నిరాశ పర్చగా.. కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టును పోటీలో నిలబడంతో పాటు తొలి మ్యాచ్‌లోనే విజయం కట్టబెట్టాడు. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
మ్యాచ్ గెలిచినప్పటి నుంచి భారత్‌లో కోహ్లీ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా మొత్తం కోహ్లీ హవానే నడుస్తోంది. కోహ్లీని ద్వేషించే వారు కూడా కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నిజానికి నేను పెద్ద పెద్ద మ్యాచుల్లో ఆడటానికే ఇష్టపడతాను. పెద్ద మ్యాచుల్లో ఆడినప్పుడే అనుభవం వస్తుంది. ఛాలెంజ్ పెద్దగా ఉన్నప్పుడే ఎదురెల్లడానికి ఇష్టపడతాను. అప్పుడే మన సత్తా ఎంటో మనకు తెలుస్తుంది. 2016లో మొహాలీలో ఆడిన టీ20 ఇన్నింగ్స్ నే నా కెరీర్‌లో బెస్ట్ అని ఇప్పటివరకు అనుకునేవాడిని. కానీ ఇప్పటి నుంచి ఈ ఇన్నింగ్సే నా కెరీర్‌లో బెస్ట్ గా నిలిచాయి. అయితే అభిమానులు మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడే నిజమైన ఆట మొదలైంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, పాకిస్తాన్‌ను ఓడించిన భారత్.. ఆ తర్వాత నెథర్లాండ్, దక్షిణ ఆఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లతో తలబడనుంది.