T20 World Cup 2022: టీమిండియా ఓటమికి కారణాలేంటి..? సెమీస్ గండాలను దాటలేమా..?

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు కథ సెమీస్‌లోనే ముగిసింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలమైన టీమిండియా.. సెమీస్ గండాన్ని దాటకుండానే స్వదేశానికి పయనమైంది. ఈ మ్యాచ్ ముగిశాక భారత జట్టుపై పలువురు సానుభూతి చూపిస్తే మరికొందరు విమర్శలకు దిగుతున్నారు. కోట్లాది ప్రజల ఆశలను రోహిత్ సేన అడిలైడ్ లో అడియాసలు చేసిందని వాపోతున్నారు. సెమీస్ వరకు అద్భుతమైన రీతిలో ఆడిన టీమిండియా.. ఈ గండాన్ని ఎందుకు దాటలేకపోయింది..?

 

నిన్నటి మ్యాచ్‌లో భారత్‌కు తొలి దెబ్బ తాకింది బ్యాటింగ్‌లోనే. నాకౌట్ స్టేజ్ లో విఫలమయ్యే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మరోసారి దారుణ ప్రదర్శన చేశారు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసినా కీలక మ్యాచ్‌లో రాహుల్ (5) రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. తొలి పవర్ ప్లేను భారత్ సరిగా వినియోగించుకోలేదు. తొలి ఆరు ఓవర్లలో టీమిండియా చేసింది 1 వికెట్ నష్టానికి 38 పరుగులు. అదీ టీ20లలో అత్యుత్తమ బ్యాటర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు క్రీజ్ లో ఉండగా అనేది దారుణం. అదే ఇంగ్లాండ్ మొదటి పవర్ ప్లేలో ఏకంగా 63 పరుగులు బాదింది.

 

స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్లు అదిల్ రషీద్.. 4 ఓవర్లు వేసి 21 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అదీ సూర్యకుమార్ యాదవ్ వికెట్ కావడం గమనార్హం. ఇక లియామ్ లివింగ్‌స్టోన్.. నాలుగు ఓవర్లలో 20 పరుగులే ఇచ్చాడు. ఈ ఇద్దరూ భారత బ్యాటర్లను కట్టడి చేశారు. మరి స్పిన్ కు సహకరించిన పిచ్ పై మనోళ్లు ఏమైనా మెరుగ్గా రాణించారా..? అంటే అదీ లేదు. అశ్విన్.. 2 ఓవర్లు వేసి 27 పరుగులిస్తే.. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చాడు.

 

ఇంగ్లాండ్ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోవడం కూడా భారత ఓటమికి ప్రధాన కారణం. ఇంగ్లాండ్ ముందు ఉన్న 169 పరుగుల లక్ష్యం మరీ కాపాడుకోలేనిదైతే కాదు. కాస్త బౌలర్లు శ్రమించి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదేమో. కానీ బట్లర్, హేల్స్ మాత్రం తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగారు. భువనేశ్వర్, అర్ష్‌దీప్, షమీ తేడా లేకుండా బాదుడు మంత్రాన్నే ఎంచుకున్నారు. వీళ్లను కట్టడి చేయకపోవడంతో భారత్‌కు అవమానకర ఓటమి తప్పలేదు.

 

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. భారత సెమీస్ ఓటమికి అన్ని కారణాలు చూపొచ్చు. కానీ భారత అభిమానులకు మాత్రం ఈ ఓటమి జీర్ణించుకోలేనిది. 2007 తర్వాత జరిగిన ఆరు ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలలో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా ఈసారైనా రాణిస్తుందని అంతా భావించారు. లీగ్ దశలో రోహిత్ సేన ఆ స్థాయిలోనే ఆడింది. కానీ సెమీస్ కు వచ్చేసరికి మాత్రం సేమ్ సీన్ రిపీట్.. మరి భారత్ సెమీస్ గండాన్ని దాటేదెన్నడో.. మళ్లీ విశ్వ కప్ లో మువ్వన్నెల జెండా రెపరెపలాడేదెన్నడో..!!

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -