Hanamkond: భార్యభర్తల గొడవలు సహజమే. ఉదయం గొడవపడి సాయంత్రం ఒకటైపోతారు. ఇద్దరు గొడవ పడినా కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు పడుతుంటారు. కానీ.. ఓ మహిళ మాత్రం ఇంట్లో నుంచి గుంచుకుని బయటకు లాక్కొచ్చిన తన భర్తను విద్యుత్ సంభానికి కట్టేసింది. అంతటితో ఆగకుండా అతడికి చెప్పుల దండ వేసి చితక్కొట్టింది. నడిరోడ్డులో భర్తను దేహశుద్ధి చేస్తున్నా ఏ ఒక్కరు కూడా ఆపేందుకు ప్రయత్నించలేదు. ఇంతకు ఆ భర్త చేసిన తప్పేంటో తెలుసుకుందాం..
మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అఖిల తల్లిదండ్రులు కట్నంగా శ్రీకాంత్ రెడ్డికి రూ.20 లక్షలు ఇచ్చారు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరికి ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత శ్రీకాంత్ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు. అనంతరం వరంగల్‌లో మరో మహిళను గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అఖిల తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త శ్రీకాంత్ రెడ్డిని పట్టుకుని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డిని ఇంటి ముందున్న విద్యుత్ స్తంభానికి కట్టేసింది.
కాసేటి తర్వాత కొన్ని చెప్పులు తీసుకుని వాటిని దండగా మార్చి శ్రీకాంత్ రెడ్డి మెడలో వేసి చితక్కొటింది. ఆమెతో పాటు బంధువులు సైతం శ్రీకాంత్ రెడ్డిని ఇష్టానుసారంగా దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. భర్తను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఇలాంటి వారికి సరైన సమాధానం ఇస్తున్నారని నెటిజన్లు తనదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.