Chandrababu Naidu: ఇటీవల నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే సస్పెండ్ అయినా కూడా శ్రీధర్ రెడ్డి ఏ మాత్రం దిగులు ఆందోళన లేకుండా ధైర్యంగా ముందు కొనసాగుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా పోరాటాలు కూడా కొనసాగిస్తున్నారు. దానికి తోడు చాలా మంది అధికార పార్టీ నేతలు కోటంరెడ్డితో టచ్ లో ఉన్నారు. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి ఇప్పుడు కోటంరెడ్డి వర్గంలో సంగతి తెలిసిందే. ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ హాజరవుతున్నారు.
కోటంరెడ్డి వర్గం నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేసి ఆరోపణలు సంధిస్తోంది. కాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, మామ అప్పారావులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేస్తే కోటంరెడ్డి హుటాహుటిన నెల్లూరు నుంచి రాజమండ్రి వెళ్లారు. ఆమెను పరామర్శించడంతో పాటు సంఘీభావంగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. టీడీపీ ఓకే అంటే వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలు పచ్చ కండువా కప్పుకుంటారని కోటంరెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కోటంరెడ్డి విడిగా సమావేశమయ్యారు. వైసీపీ అరాచకాలు, రాష్ట్ర రాజకీయాలు చర్చకు వచ్చాయి. అంతకుమించి టీడీపీలో చేరే విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు.
అయితే తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానం అందుతోందని కోటంరెడ్డి తెలిపారు. విలేకర్లు అడిగితే మాత్రం టీడీపీలో చేరే విషయంపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తానంటున్నారు. అంతవరకు బాగానే ఉన్న టీడీపీ వైపు నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. చంద్రబాబు నోటి నుంచి ఒక్క పదం ఓకే అని వస్తే కోటంరెడ్డి టిడిపిలోకి చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విషయంపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది అర్థం కావడం లేదు. ఈ సమయంలో చంద్రబాబు తన బలగాన్ని మరింత పెంచుకోకుండా మౌనంగా ఉండటం పట్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.