Kadiyam: మంచినీళ్లు ఇమ్మంటే మూత్రం తాగమన్నారు.. కడియం పోలీస్ స్టేషన్ లో ఏకంగా ఇంత దారుణమా?

Kadiyam: తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్‌స్టేషన్‌లో ఒక దళిత యువకుడిపై ఎస్సై తన ప్రతాపాన్ని చూపారు. మహిళ అదృశ్యం కేసులో అనుమానితుడైన వ్యక్తికి ద్విచక్రవాహనం ఇచ్చారన్న అనుమానంతో స్టేషన్‌కు తీసుకొచ్చి, విచక్షణారహితంగా దాడి చేశారు. దెబ్బలకు తాళలేక కిందపడితే నాటకాలాడుతున్నావా అంటూ బెదిరించారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. దెబ్బలకు తాళలేక ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఎదురైతే పోలీసులే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వివాదం బయటకు రాకుండా పెద్దల సాయంతో రాజీకి విశ్వ ప్రయత్నాలు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడంతో పోలీసులు ఎట్టకేలకు అతనిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.

 

అసలేం జరిగిందంటే.. తాజాగా కడియం పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడిపై ఎస్సై తన ప్రతాపం చూపడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యాడు. ఒక మహిళ అదృశ్యం కేసులో అనుమానితుడైన వ్యక్తికి ద్విచక్రవాహనం ఇచ్చాడన్న అభియోగంపై తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం కుంకుడుమిల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు వడ్డి వెంకట ప్రసాద్‌ను కడియం పోలీసులు ఈ నెల 17న స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి ఎస్సై ఆర్‌.శివాజీ కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ యువకుడు ఊపిరి తీసుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువకుణ్ని పోలీసులే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయితే అదుపులోకి తీసుకున్నట్లు గానీ, ఆసుపత్రిలో చేర్పించినట్లు గానీ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబీకులు చెబుతున్నారు.

ఆసుపత్రి నుంచి శనివారం డిశ్ఛార్జి అయిన వెంకటప్రసాద్‌ నడవలేని స్థితిలో చక్రాల కుర్చీలో వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని మీడియాకు వెల్లడించారు. నా స్నేహితుడికి 15 రోజుల క్రితం ద్విచక్రవాహనం ఇచ్చాను. అతనికి బైక్‌ ఇచ్చినందుకు కడియం నుంచి ఒక కానిస్టేబుల్‌ వచ్చి నన్ను ఊనగట్ల తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు కడియం తీసుకెళ్లారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సీఐ, ఎస్సై వచ్చారు. ఎస్సై శివాజీ నన్ను లోపలికి తీసుకెళ్లి పరుష పదజాలంతో తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ముఖం మీద రెండుసార్లు కొట్టడంతో కిందపడిపోయాను. నటిస్తున్నావేంట్రా అని ఇద్దరు కానిస్టేబుళ్లు మళ్లీ కొట్టారు. సార్‌ దాహం వేస్తోంది. ఆయాసం వస్తోంది, కొంచెం నీళ్లు ఇవ్వండని అడిగితే నా మూత్రం తాగరా అంటూ ఎస్సై నోటికొచ్చినట్లు తిట్టారు. తరువాత సంతకాలు తీసుకుని బయటకు పంపించారు. బయటకు రాగానే ఊపిరి అందక ఎగ శ్వాస వచ్చింది. పోలీసులే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆక్సిజన్‌ పెట్టి, నాలుగు ఇంజక్షన్లు చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అంబులెన్స్‌లో పోలీసులే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. నీకేం కాదు మేమే బిల్లు కడతామన్నారు. రాత్రంతా హాస్పిటల్ లోనే ఉన్నారు. నా ఫోన్‌ పోలీసులు తీసుకోవడంతో ఇంట్లోవాళ్లకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాను. నాతో వచ్చిన ఇద్దరు స్నేహితులు ఇంటికెళ్లి చెప్పారు. నేను ఆసుపత్రిలో ఒకరి ఫోన్‌ తీసుకుని ఇంటికి ఫోన్‌ చేశాను. తరువాత కానిస్టేబుళ్లు వచ్చి ఇంటికి ఫోన్‌ చేశావా.. మేం కొట్టామని చెప్పావా? అని అడిగితే అవునని సమాధానమిచ్చా. నేనింకా సరిగా చూడలేకపోతున్నా నిల్చోలేకపోతున్నా. డిశ్ఛార్జి చేయడంతో ఇంటికెళ్లిపోతున్నా అంటూ బాధితుడు శనివారం ఆవేదన వ్యక్తం చేశాడు.

 

కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ తిలక్‌ ఎస్సై శివాజీపై శుక్రవారం ఐపీసీ 323, 324, అండ్‌ సెక్షన్‌ 31,ఆర్‌ అండ్‌ 3 వీఏ, ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సైను విధుల నుంచి తప్పించామని తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. కొట్టిన తర్వాత కిందపడిపోయానని, మూత్రం పోస్తామని పోలీసులు అన్నారని ప్రసాద్‌ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని జిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కేసును దిశ డీఎస్పీ తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ రజిని ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు సేకరించారు. పోలీసులు ఎడమ దవడపై కొట్టడం వల్ల ఊపిరి తీసుకోవడంలో సమస్య వచ్చి వాంతులయ్యాయని, బాధితుణ్ని 17న అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 ప్రాంతంలో ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎంఎల్‌సీ రిపోర్టులో పేర్కొన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -