Volunteers Campaigning: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న వాలంటీర్లు.. మరీ ఘోరమంటూ?

Volunteers Campaigning: మరోసారి అధికారంలోకి వస్తామని నమ్మకమో.. రూల్స్ తమకు వర్తించవని బరితెగింపో తెలియదు కానీ.. జగన్ సైన్యం ఎవడి మాట వినని సీతయ్యలా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులతో అంటకాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు వారి కోసం ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల వెంటే ఉంటూ వైసీపీకి ఓటు వేయాలని చెబుతున్నా.. అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు ప్రశ్నిస్తే.. మా ఇష్టం మీరెవరు చెప్పడానికి అని ఎదురు తిరుగుతున్నారు. అయితే.. ఈ తతంగాన్ని ఎన్నికల సంఘం అధికారులు కానీ, కలెక్టర్లు కానీ పట్టించుకోకుండా ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. పట్టణంలోని 99వ పోలింగ్ స్టేషన్ పరిధిలో 29వ వార్డులో నరసింహులు అనే వాలంటీర్ బుట్టారేణుకతోపాటు ప్రచారం చేశారు. ఇదంతా చూసిన టీడీపీ నేతలు నరసింహులుపై ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. అధికార పార్టీ కోసం పని చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే.. ఇలాంటి ఘటనలు కర్నూలు, ఎమ్మిగనూరుకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అడుగడుగునా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అన్నమయ్య జిల్లా పీలేరులో కూడా శివ, సతీష్ అనే ఇద్దరు వాలంటీర్లు స్థానిక నేతల కోసం ప్రచారం చేశారు. అటు, శ్రీకాకుళం జిల్లాలో కూడా అడుగడుగునా వాలంటీర్లు బరితెగిస్తున్నారు. కోర్టులు, ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంటింటికి వెళ్లి వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17న అంటే.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రోజు 589 కార్డులు అందజేశారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 104, 18న 209 కార్డులు పంపిణీ చేశారు. నిజానికి ఎన్నికల కోడ్ కంటే చాలా ముందుగానే వీటిని పంపిణీ చేయాలని ప్లాన్ ఉంది. కానీ, కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికలకు ముందు అయితే.. ఓటర్లను ప్రభావితం చేయొచ్చనే అంచనాతో మొత్తం 798 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఇక.. జగన్ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు సిద్దం సభలు నిర్వహించారు. అదే విధంగా స్థానిక నేతలు జిల్లా, మండల, గ్రామాల్లో సిద్దం సభలు నిర్వహిస్తున్నారు. ఈ సిద్దం సభల్లో కూడా వాలంటీర్లే అంతా తామై చూస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసమండ గ్రామాల్లో సోమవారం వైసీపీ నిర్వహించిన సిద్దం గ్రామస్థాయి సభలో వాలంటీర్లే ఎక్కువగా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా మేము సిద్దం అంటూ నినాదాలు చేశారు.

ఇలా వాలంటీర్లే వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎవరికి ఏ పథకాన్ని ఇచ్చిందో ఇంటింటికి వెళ్లి గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వం మారితే ఆ పథకాలు అమలుకావని పరోక్షంగా బెదిరిస్తున్నారు. అయితే.. వాలంటీర్ల బరితెగింపు చూసి టీడీపీ, జనసేన నేతలు నివ్వెరబోతున్నారు. ఇంత ధైర్యంగా ఎలా ప్రచారం చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. అయితే.. వైసీపీ నేతల అండతోనే వాలంటీర్లు ఇలా బరితెగిస్తున్నారని అంటున్నారు. ఎవరైనా అడిగితే తిరిగి కేసులు పెడతామని బెదిరించాలని వాలంటీర్లకు వైసీపీ నేతలు దిశానిర్థేశం చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు గట్టిగా ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్సీ, మహిళతో కేసులు పెట్టించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -