Pradeep Machiraju: టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్ల హవా నడుస్తోంది. ఇప్పుడున్న మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు మంచి ఫామ్ లో ఉన్నాడు. తాజాగా ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత పది రోజుల నుంచి ఆ వార్త షికారు చేస్తోంది. అయితే ప్రదీప్ పెళ్లి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పెళ్లి గురించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా ప్రదీప్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నవ్య మారోతును పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ నడుస్తోంది. వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోందని మరో వార్త హల్ చల్ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరు ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రదీప్ మాచిరాజు తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అటు ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు ప్రదీప్ క్లారిటీ ఇచ్చాడు. నవ్యతో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. సోషల్ మీడియాలో తనకు పెళ్లి జరిగిందని, నిశ్చితార్థం అయ్యిందని పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రదీప్ వాటిని కొట్టిపారేశాడు.
సోషల్ మీడియాలో తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అసలు ఆ అమ్మాయితో తనకు పరిచయం కూడా లేదని ప్రదీప్ మాచిరాజు స్పష్టం చేశాడు. ఇప్పటివరకు తాను ఆ అమ్మాయిని కలవలేదని ప్రదీప్ సోషల్ మీడియాలో వివరించాడు. అలాగే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని ప్రదీప్ తేల్చి చెప్పాడు. త్వరలోనే తన రెండో సినిమా ప్రారంభం కానుందని, మంచి అప్డేట్ ను త్వరలోనే అందరికీ చెబుతానని ప్రదీప్ తెలిపాడు.