Hyper Aadi: జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఆది పంచ్ డైలాగులకు జడ్జీలు సైతం పడి పడి నవ్వాల్సిందే. వెండితెరపై కూడా ఆదికి మంచి అవకాశాలు వస్తున్నాయి. మరో వైపు రాజకీయాలవైపు కూడా ఆది మొగ్గు చూపుతున్నాడు. జనసేన సంకల్పించిన రణస్థలి బహిరంగ సభలో హైపర్ ఆది తన స్పీచ్ తో ఇరగదీశాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ చెప్పకనే చెప్పాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి టికెట్ ఇస్తామనే హామీ కూడా ఆదికి వచ్చినట్లు నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం హైపర్ ఆది తన వాక్చాతుర్యం, పంచులతో సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవుతూ వస్తున్నాడు. బీటెక్ చదివిన ఆది హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే టైంలో ఒక షార్ట్ ఫిల్మ్‌తో జబర్దస్త్ లోకి ప్రవేశించాడు. ఓపెనింగ్ ఎపిసోడ్‌తోనే తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ను హైపర్ ఆది ఏర్పాటు చేసుకున్నాడు. ఆది స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి కావడంతో బుల్లితెరపై కామెడీ ప్రోగ్రాంతో మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడని చెప్పాలి.
గత ఎన్నికలో కూడా జనసేన తరపున నాగబాబుతో కలిసి ఆది ప్రచారంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు మూవీలో కూడా నటిస్తున్నాడు. ఆ షూటింగ్ స్పాట్లోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి ఆది మరింత దగ్గరైనట్లు తెలుస్తోంది. ఆ చొరవే ఆదిని జనసేన వేదిక ఎక్కేలా చేసింది. ఆది ఆకట్టుకునేలా మాట్లాడిన తీరును, ఆ స్పీచ్‌ని పవన్ కళ్యాణ్ కూడా ఎంజాయ్ చేయడాన్ని అందరూ చూశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శించేవారిపై రణస్థలం సభలో ఆది ఫైర్ అయ్యాడు. జనసేన అధినేత నుంచి హామీ ఉండబట్టే ఆది అంతదూరం వెళ్లాడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సబ్జెక్ట్‌ని ఈజీగా హత్తుకునేలా కమ్యూనికేట్ చేయగలిగే సత్తా ఆదికి ఉండటంతో ఆయన రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత చేరువవుతాడన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. వ్యక్తిగతంగా పవన్‌ని అభిమానించే ఆది జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారంటూ నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పోటీగా నగరి నుంచి హైపర్ ఆది పోటీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.