Bandi Sanjay: తాంత్రికుల సూచనతోనే బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్.. బండి ఆరోపణల మర్మమేమిటి..?

Bandi Sanjay: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రణాళికలు రచిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఆ  పార్టీ  పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వెనుక గల కారణాలను కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ  వర్గాలు కూడా ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేశాయి. ప్రాంతీయ పార్టీగా జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురాలేమని అందుకే పేరు మార్చామని  టీఆర్ఎస్ వర్గాలు  ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ పేరు మార్పునకు అసలు కారణం వేరే ఉందంటున్నాడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)  అధ్యక్షుడు బండి సంజయ్. తాంత్రికుల సూచనలతో క్షుద్ర పూజలు చేసి మరీ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారని  ఆరోపించారు. మరి ఇందులో నిజమెంత..? తాంత్రికుల సూచనల మేరకే కేసీఆర్ పార్టీ పేరును మార్చారా..?

కేసీఆర్‌కు దైవ భక్తి ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే. నిత్యం యాదాద్రీశుడిని దర్శించుకోవడం, చినజీయర్ స్వామికి సాష్టాంగ ప్రణామాలు చేయడం, చండీ యాగం పేరిట ఓ భారీ పూజా కార్యక్రమం చేసిన విషయం తెలిసిందే. దైవ భక్తి ఉన్న కేసీఆర్‌కు నమ్మకాలూ, పట్టింపులూ ఎక్కువే అనేది బహిర్గతమే. మరి బండి ఆరోపించినట్టు కేసీఆర్ నిజంగానే ఎర్రబెల్లిలోని తన ఫాంహౌజ్‌లో నల్లపిల్లితో తాంత్రిక  పూజ చేశారా..?  పూజల అస్తికలను కలపడానికి కాళేశ్వరం వెళ్లారా..?

బండి ఆరోపణలు ఇలా ఉంటే మరోవైపు టీఆర్ఎస్ పేరు మార్పు వెనుక కేసీఆర్ కేసులు తప్పించుకోవడమే కారణమని  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో గులాబీ కూలీ పేరిట నిధులు వసూలు చేసిన కేసీఆర్.. వాటితో పాటు అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే  పార్టీ పేరు మార్చారని రేవంత్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకేగూటి పక్షులని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారే అవకాశాలు లేవని, తమ పార్టీ రద్దవుతుందనే భయంతోనే కేసీఆర్.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారని ఆరోపించారు.

పరిపాలనతో పాటు పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు కేసీఆర్ తన ఫాంహౌజ్ నుంచే చక్కబెడతారు. అయితే కేసీఆర్ క్షుద్ర పూజలు చేశారా..? అనేవి గాలిమాటలేనని కొట్టిపారేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. బండికి పిచ్చి ముదిరిందని.. అతడిని ఎర్రగడ్డలో చేర్పించండని మండిపడుతున్నారు.  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఏకంగా.. ‘ఈ లవంగం  గారిని ఇలాగే వదిలెయ్యకండిరా బాబులు.. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం కూడా మొదలుపెడతాడేమో..’ అని గట్టిగానే  కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా.. ‘బండి సంజయ్ భూత వైద్య కోర్సులో చేరితే బాగుంటుంది..’ అని ఎద్దేవా చేశారు.

ఇదిలాఉండగా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో..  నియోజకవర్గంలో రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులు వస్తున్నాయని చెప్పడం అక్కడ వివాదాస్పదమైంది. ఇది పార్టీకి కొంచెం నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది. ఇదే అంశాన్ని  టీఆర్ఎస్ వర్గాలు జోరుగా ముందుకు తీసుకెళ్తున్నాయి. దీంతో ఈ అంశాన్ని దారి మళ్లించడానికే  బండి సంజయ్.. ‘క్షుద్ర రాజకీయం’ చేస్తున్నాడని ఆరోపిస్తున్నాయి.

ఇరు పార్టీల నాయకులు ‘నువ్వంటే నువ్వు’ తిట్టుకోవడమే తప్ప మునుగోడులో ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని సామాన్య ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు రూ. 40 వేల  దాకా పలుకుతున్న మునుగోడులో ఇప్పుడు ఖర్చు చేసేదాంట్లో సగమైనా తమ నియోజకవర్గం కోసం ఖర్చు పెడితే తమ బతుకులు బాగుపడేయని చెప్పుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -