Rahul Gandhi: గతంలో రాహుల్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టీ కాంగ్రెస్‌లో జోష్ నింపుతున్న భారత్ జోడో యాత్ర..

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం, నాయకులు, శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర.. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తైంది. ఇప్పటికే రాహుల్ దాదాపు 1,200 కి.మీ యాత్రను పూర్తిచేశారు. ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ‌లో ప్రజలు సరికొత్త కోణాన్ని చూస్తున్నారు. ఇక, కాంగ్రెస్ శ్రేణుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాహుల్ యాత్ర‌లో తన వద్దకు వచ్చేవారిని పలకరించే విధానం, కార్నర్ మీటింగ్స్‌లో స్థానిక సమస్యలపై స్పందించే విధానం, ప్రెస్ మీట్‌‌లలో ఆయన మాట్లాడుతున్న తీరు.. రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ విషయానికి వస్తే.. అక్టోబర్ 23న రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. అయితే ఆ రోజు దాదాపు 4 కి.మీ మేర మాత్రమే రాహుల్ యాత్ర సాగింది. అయితే మూడు రోజుల విరామం (దీపావళి, కాంగ్రెస్ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే బాధ్యత స్వీకరణ కార్యక్రమం) తర్వాత రాహుల్ పాదయాత్ర అక్టోబర్ 27న తిరిగి ప్రారంభమైంది.

రాహుల్ పాదయాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. అయితే రాహుల్ కూడా ఉత్సాహంగా సాగడంతో.. కాంగ్రెస్ శ్రేణులు సంబరపడిపోతున్నారు. తెలంగాణ సంస్కృతి, కళాకృతులు.. పట్ల రాహుల్ చూపిస్తున్న మక్కువ సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. బతుకమ్మ ఆడటం, గిరిజనులతో కలిసి కాలు కదపడం, బోనాలతో తన వద్దకు వచ్చినవారితో మమేకం కావడం.. టీ కాంగ్రెస్ నాయకులను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుందనే మాట వినిపిస్తుంది.

ఉదయం పూటే పాదయాత్ర ప్రారంభిస్తున్న రాహుల్ గాంధీ.. యాత్ర మార్గంలో తనతో సమస్యలు చెప్పుకునేవారిక అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం పూట రోడ్లపై పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులు తనను కలిసేందుకు వస్తే వారితో అప్యాయంగా మాట్లాడుతూ.. ఫొటోలు కూడా దిగుతున్నారు. విద్యార్థులు, రైతులే కాకుండా అనేక వర్గాల సమస్యలను రాహుల్ వింటున్నారు. అలాగే తెలంగాణలో పార్టీకి సంబంధించి పొత్తులపై గురించి స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేయడమే కాకుండా.. గులాబీ పార్టీతో తమకు పొత్తు ఉండదని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి కాంగ్రెస్ పార్టీ పొత్తులపై ఎటువంటి అయోమయం లేకుండా చేసేశారు.

ఇదిలా ఉంటే.. చిన్న పిల్లలను, వృద్దులను అప్యాయంగా దగ్గరకు తీసుకోవడం, పిల్లలతో కలిసి పరుగు పందెం, ఆర్టీసీ కార్మికులను కలిసేందుకు బస్సు ఎక్కడం, చారిత్రత్మక చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ జెండాను ఎగరవేయం.. రాహుల్‌ యాత్రను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇక, రాహుల్ పాదయాత్రలో భారీ జనసందోహం మధ్య కిందపడిపోయిన ఓ వృద్దురాలిని చూసి రాహుల్ చలించిపోయారు. జనంలో ఉన్న ఆమె వద్దకు వెళ్లి స్వయంగా నీరు అందించడమే కాకుండా.. ఆమె కుదురుకునే వరకు పర్యవేక్షించారు. దీంతో ఆమె రాహుల్‌కు చేతులెత్తి మొక్కారు. అంతేకాకుండా వృద్దురాలికి చెప్పులు కూడా అందించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధంగా పాదయాత్రలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాహుల్ స్పందిస్తున్న తీరు ఆయనలోని కంప్లీట్ డిఫరెంట్ కోణాన్ని ప్రజలకు పరిచయం చేస్తోంది. ఈ పాదయాత్రతో గతంలో రాహుల్ వ్యక్తిత్వంపై విమర్శలు చేసేవారికి.. మళ్లీ అలాంటి కామెంట్స్ చేసేందుకు ఆయన అవకాశం లేకుండా చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts