టీడీపీకి మరో లగడపాటి దొరికారా?

ఆంధ్రా అక్టోపస్ గా అందరూ పిలుచుకునే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీవ్రంగా పోరాటం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కొట్లాడారు. సమైకాంధ్ర ఉద్యమం ద్వారా రాష్ట్ర విభజనను ఆపేందుకు అలుపెరగని పోరాటం చేశారు. చివరికి విభజన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో పెప్పర్ స్పే ప్రయోగించి సంచలనం లేపారు. చివరి వరకు రాష్ట్రం విడిపోకుండా ప్రయత్నించేందుకు శతవిధాలు ట్రై చేశారు. కానీ చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించలేదు, రాష్ట్రం రెండుగా చీలిపోవడంతో లగడపాటి రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని శపథం చేశారు. ఆ శపథం ప్రకారం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. తమ పార్టీలో చేరాలని చాలా పార్టీలు ఆఫర్ చేశాయి. కానీ వాటికి లగడపాటి తలొగ్గకుండా తన మాట మీదే కట్టుబడి ఉన్నారు. అయితే రాజకీయ పార్టీల నేతలతో మాత్రం లగడపాటికి పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీలలోనూ పలువురు నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.

దీంతో గత ఎన్నికల్లో పరోక్షంగా టీడీపీ తరపున లగడపాటి పనిచేశారు. పలు సర్వేలు నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుకు అందించేవారు. సర్వేలు చేసి ఎవరికి టికెట్లు కేటాయించాలి.. టీడీపీ పరిస్ధితి ఎలా ఉందనే వివరాలను అందించేవారు. సర్వేలు చేయించడంలో లగడపాటి దిట్ట అని చెప్పవచ్చు. గతంలో ఆయన చేసిన సర్వేలన్నీ నిజం కావడంతో లగడపాటికి సర్వే పరంగా మంచి పేరు ఉంది. దీంతో సర్వేలపరంగా ఆయన అనుభవాన్ని గత ఎన్నికల్లో టీడీపీ ఉపయోగించుకుంది.

కానీ గత ఎన్నికల్లో లగడపాటి అంచనాలు బొల్తా కొట్టాయి. ఆయన అంచనాలు తలక్రిందులయ్యాయి. టీడీపీ గెలిస్తుందని ఆయన తన సర్వే అంచనాలు వెల్లడించగా.. అవి ఫలించలేదు. సర్వేలు చేయడం తన హాబీ అని చెప్పే లగడపాటి.. గత ఎన్నికల్లో ఆయన సర్వేలు తప్పని తేలడంతో ఇకపై సర్వేలు చేయనంటూ శపథం చేశారు. సర్వేలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఇక లగడపాటి సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే వసంతను కలవడం ప్రాధాన్యతను సంతరించుకకుంది.

ఇది ఇలా ఉంచితే.. ఇప్పుడు ఏపీకి మరో లగడపాటి దొరికారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఏపీలో మరో లగడపాటిగా మారారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన రూపంలో టీడీపీకి మరో లగడపాటి దొరికారని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం రఘురామ క్రిష్ణం రాజు ఒక సర్వేను బయటపెట్టారు. ప్రతిరోజు రచ్చబండ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాజా రాజకీయ పరిణామాలపై స్పందించే ఆయన.. గత కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో తాను చేయించిన ఒక సర్వే రిపోర్టును బయపెట్టారు.

ఒక ప్రముఖ సర్వే సంస్ధతో తాను స్వయంగా సర్వే చేయించానని, ఒక యాప్ ద్వారా సర్వే చేసినట్లు తెలిపారు. రెండు, మూడు తప్పితే ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తీసుకుని యాప్ లో నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం క్రోడీకరించి సర్వే రిపోర్టును తయారుచేసినట్లు చెప్పారు. ఈ సర్వే రిపోర్టును స్వయంగా రఘురామ క్రిష్ణం రాజు చదివి వినిపించారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ, వైసీపీ ఓట్ల శాతాన్ని వెల్లడించారు.

రఘురామరాజు సర్వే ప్రకారం.. ఏపీలో టీడీపీకి 94 సీట్లు వస్తాయని తేలగా.. వైసీపీకి 75 వస్తాయని తేలింది. ఇక చాలా నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ మధ్య టప్ ఫైట్ ఉందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం మరింత పెరిగిందన్నారు. టీడీపీ, జనసేన గెలిస్తే మాత్రం వార్ వన్ సైడ్ అవుతుందని అంచనా వేశారు. రాయలసీమలో కడప మినహా మిగతా జిల్లాల్లో వైసీపీ ప్రభావం తగ్గిందని, టీడీపీ బలం పుంజుకుందని తెలిపారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూడా వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని సర్వేలో తేలినట్లు చెప్పారు.

ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 54 ఉన్నాయని,వైసీపీ ఖచ్చితంగా గెలిస్తే స్థానాలు 10 నుంచి 12 మాత్రమే ఉన్నాయన్నారు. ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రఘురామ క్రిష్ణం పరోక్షంగా చెప్పారు. దీంతో ఈ సర్వేపై వైసీపీ నేతలు, కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. టీడీపీకి మరో లగడపాటి దొరికారని, రానున్న రోజుల్లో టీడీపీ తరపున ఆయన మరిన్ని సర్వేలు బయటపెడతారని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో లగడపాటి సర్వేల ద్వారా ప్రజల్లో బలం పెంచుకునేందుకు టీడీపీ మైండ్ గేమ్ ఆడిందని అంటున్నారు. ఇప్పుడు లగడపాటి పాత్రను నర్సాపురం ఎంపీ పోషిస్తున్నారని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే రోజూ ప్రెస్ మీట్లతో వైసీపీ, జగన్ పై ఒంటికాలిపై రఘురామ క్రిష్ణం లేస్తున్నారు. జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును పొగిడేస్తున్నారు. దీంతో రఘురామ క్రిష్ణం వెనుక టీడీపీ ఉందనే ప్రచారం కూడా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -