CM YS Jagan: ఎన్నికలకు జగన్ రెడీ.. మరుగున పడిన ఆ పథకం మళ్లీ అమల్లోకి

CM YS Jagan: గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం వైఎస్ జగన్ సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 175 సీట్లకు గాను ఏకంగా 150 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు పూర్తి అయింది. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. అయితే జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభివృద్ది లేదనే మాట ప్రజల నోట వినిపిస్తోంది. అభివద్ది కార్యక్రమాలు ఒక్కటి కూడా చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. సంక్షేమం పరంగా కాస్త పర్వాలేదు అనిపించినా.. అభివృద్ధి మాత్రం ఏపీలో కుంటుపడిపోయింది. దీంతో జగన్ సర్కార్ తో పాటు నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నట్లు పీకే సర్వేల్లోనూ తేలినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అలాంటి వారిని పక్కనపెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

అయినా జగన్ మాత్రం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుని ఉన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే తనను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సంక్షేమ పథకాలపైనే జగన్ ఫోకస్ పెట్టారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో సంక్షేమ పథకాలకే జగన్ పెద్దపీట వేసినట్లు అర్థమవుతుంది.

తాజాగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్యాణమస్తు పథకాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కోసం వైఎస్సార్ కల్యాణమస్తు షాదీతోఫా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ పెళ్లికానుక పథకం అమలు కోసం గతంలోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబినెట్ లో దీనికి ఆమోదముద్ర వేశారు. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టేసింది.

2019 సెప్టెంబర్ 16న వైఎస్సార్ పెళ్లికానుక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2020 ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించింది. దీని కోసం రూ.750 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ లో ఆమోదముద్ర కూడా వేశారు. కానీ ఆ తర్వాత కరోనా కారణంగా నిధులకు ఆటంకం కలగడంతో ఈ పథకం అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్థికంగా అప్పులు వల్ల డబ్బులు లేవనే కారణంతో పథకాన్ని అమలు చేయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో ఈ పథకాన్ని మళ్లీ జగన్ సర్కార్ తెరపైకి తెచ్చింది.

ఆగిపోయిన సంక్షేమ పథకాలన్నీ ఎన్నికల నాటికి మళ్లీ అమలు చేయాలని సీఎం జగన్ చూస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజల కోసం దుల్హన్ అనే పథకాన్ని అప్పటి ప్రభుత్వం అమలు చేసింది. కానీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ పథకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఆ పథకం మాదిరిగానే కొన్ని మార్పులు చేసి వైఎస్సార్ పెళ్లి కానుక పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీని వల్ల ఆ వర్గాల ప్రజలు తమవైపు ఉంటారని జగన్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -