Konda Vishweshwar Reddy: కొండా చూపు కారు వైపు..? మళ్లీ గులాబీ గూటికి విశ్వేశ్వరరెడ్డి! పిచ్చోళ్లయ్యేది జనమేనా..?

Konda Vishweshwar Reddy: ‘ఇందుగలవాడందులేడన్న సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందు కలను..’ అన్నరీతిగా తయారయ్యారు మన ఘన రాజకీయ నాయకులు. ఇవాళ ఒక పార్టీలో కనబడ్డ నాయకుడు వారం రోజుల తర్వాత అదే పార్టీలో ఉంటాడన్న గ్యారెంటీ లేదు. అధికార పార్టీ సంగతి పక్కనబెడితే విపక్ష నాయకులైతే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో..? ఏ పార్టీ కండువా వేసుకుని దర్శనమిస్తారో..? అన్నట్టుగా అంతా అస్తవ్యస్తంగా ఉంది. దేశ రాజకీయాల సంగతేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్య ఈ ‘జంప్ జిలానీ’లు మరీ ఎక్కువయ్యాయి. కొద్దిరోజుల క్రితమే హస్తాన్ని వీడి కమలం గూటికి వెళ్లిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తిరిగి పాత కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. చేవేళ్ల మాజీ ఎంపీ తిరిగి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.

 

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది మన తాత ముత్తాతల నుంచి వింటున్న ముచ్చటే. ఇదే సూత్రాన్ని మరోసారి రుజువు చేస్తూ కొండా తిరిగి కారెక్కనున్నరని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నది. పొద్దున లేచింది మొదలు పొద్దుగూకే దాకా కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ పై ‘రాజీలేని పోరాటం’ చేస్తున్నానని చెప్పుకుంటున్న ఆయన తిరిగి మళ్లీ గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.

హైదరాబాద్ లో ప్రారంభమైన ఇండియన్ రేస్ లీగ్ ను మంత్రి కేటీఆర్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ లీగ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ నాయకుడిగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి.. కేటీఆర్ తో సన్నిహితంగా మెలగడం ఇద్దరూ కలిసి జాన్ జిగ్రీ దోస్తుల మాదిరిగా మాట్లాడుకోవడంతో ఈ అనుమానాలు నిజమేనని ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ పోటీలలో విశ్వేశ్వరరెడ్డి కొడుకు కొండా అనిందిత్ రెడ్డి కూడా పాల్గొంటున్నాడు. బీజేపీలో చేరినప్పుడు కొండా టీఆర్ఎస్ మీద దూకుడుగా విమర్శలు సంధించేవారు. కానీ కొంతకాలంగా ఆ పదును కూడా తగ్గిందని స్వయంగా ఆయనతో ఉండే నాయకులే చెప్పుకుంటున్నారు.

కొండా ప్రస్థానం..

2013లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు కారెక్కిన విశ్వేశ్వరరెడ్డి 2014లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. 2018లో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ ఏడాది జులైలో కేంద్ర మంత్రుల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

నెలకొకరిని తీసుకొస్తా అని..

బీజేపీలో ఆయన చేరిన వెంటనే ఆయనను చేరికల కమిటీలో సమన్వయ సభ్యుడిగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. ‘నెలకొక్క లీడర్ అయినా బీజేపీలోకి తీసుకొస్తా..’ అని అన్నారు. మరి ఆయన ఎంతమంది నాయకులను బీజేపీలో చేర్పించారో తెలియదు గానీ ఇప్పుడు ఏకంగా ఆయనే మరో పార్టీకి వెళ్తున్నానని వార్తలు వస్తుండటం గమనార్హం.

ప్రాధాన్యం లేకే..?

కాంగ్రెస్ గూటి నుంచి బీజేపీకి వెళ్లిన కొండాకు అక్కడ తగిన ప్రాధాన్యం లేదని, అక్కడి కంటే ఇంకా కాంగ్రెస్ లోనే ఆయనకు తగినం గౌరవముండేదనే ఆవేదనలో ఆయన ఉన్నట్టు తెలుస్తున్నది. చేరికల కమిటీ అని చెప్పినా ఇంతవరకూ పేరుమోసిన నాయకుడెవరూ కమలం గూటికి చేరేనే లేదు. ఇదే కమిటీలో ఉన్న ఈటల రాజేందర్ తో పాటు బండి సంజయ్, డీకే అరుణ, కిషన్ రెడ్డి వంటి వర్గాల నడుమ కొండా ఇముడలేకపోతున్నారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు.

జనమే పిచ్చోళ్లా..?

కొండా పార్టీ మారుతారనే నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు నాయకులను నమ్ముకున్న జనం పిచ్చోళ్లా..? అని సోషల్ మీడియా వేదికగా నెటిజనులు కారాలు మిరియాలు నూరుతున్నారు. పొద్దంతా తిట్టుకున్నా లీడర్లంతా ఒక్కటేనని.. చివరికి వాళ్ల మాటలు నమ్మి మోసపోవడమే జనం వంతు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ నాయకులను పొగడటం, వారికి అందాల్సిన ‘తాయిళాలు’ అందకపోవడంతో మళ్లీ దూషణలకు దిగడం చూస్తుంటే రాజకీయాలంటేనే అసహ్యం వేసేంత జుగుప్సాకరంగా తయారయ్యాయని ప్రజలు వాపోతున్నారు.

 

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts