BRS Party: పార్టీ పేరును మార్చబోతున్న కేసీఆర్.. మళ్లీ పాత పార్టీ పేరు పెడితే ఆయనకు కలిసొస్తుందా?

BRS Party: టీఆర్ఎస్, తెలంగాణ.. ఈ రెండింటి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న కేసీఆర్.. పేగుబంధం లాంటి పార్టీ పేరును సైతం మార్చి రింగ్ లోకి దూకారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితికి మార్చారు. ఆ పేరుతోనే ఇటీవలి కాలంలో ఎన్నికలకు కూడా వెళ్లారు. అయితే.. ఇప్పుడు పార్టీ పేరును మరోసారి మార్చాలని అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీ పేరు మార్చి పెద్ద మిస్టేక్ చేశానా అని కేసీఆర్ తనలో తాను ఎంతో మదనపడుతున్నారని తెలుస్తోంది.

2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా TRSని స్థాపించారు కేసీఆర్. దాదాపు 12 ఏళ్లపాటు పోరాటాలు చేశారు. అలా 2014లో తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి సీఎం పీఠం అధిరోహించారు. అక్కడి నుంచి కేసీఆర్ వెనక్కుతిరిగి చూసుకోలేదట. అది చేసేస్తా.. ఇది చేస్తానంటూ ఎంతో ఎగిరెగిరిపడ్డారు. అలాంటి టైంలో పుట్టిన ఆలోచనే జాతీయ రాజకీయాలు. కేంద్రంలో తనదైన ముద్ర వేస్తానంటూ గులాబీబాస్ 2022 అక్టోబరు 5న పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నట్టు ప్రకటించారు. బులిటెన్ కూడా జారీ చేశారు. ఇక అక్కడి నుంచి ఆగకుండా.. గుణాత్మక మార్పు అంటూ ఓ నాలుగైదు రాష్ట్రాలు తిరిగివచ్చారు. ఆ క్రమంలోనే పక్కనే ఉన్న మహారాష్ట్రపై ఫస్ట్ ఫోకస్ కూడా పెట్టారు. భారీ కార్ల ర్యాలీతో ఇక్కడి నుంచి నానా హంగామా చేసుకుంటూ అక్కడికి వెళ్లారు. పార్టీ ఆఫీస్ను ప్రారంభించారు. అక్కడ కమిటీలు ఏర్పాటు చేసే బాధ్యతలను సుమన్, జీవన్ రెడ్డికి అప్పగించారు. తొలుత మరాఠీ నాయకుడు దిలీప్ గోరేను పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించారు. వందల కోట్ల రూపాయాల ఖర్చు చేసి మహారాష్ట్రలో విస్తృత ప్రచారం అయితే కల్పించుకున్నారు. అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఒకట్రెండు సర్పంచ్ లు గెలుపొందారు. ఆ తర్వాత ఏపీకి బీఆర్ఎస్ అధ్యక్షునిగా మాజీ IAS అధికారితోట చంద్రశేఖర్ ను నియమించారు. మహారాష్ట్రపై చూపించినంత ఇంట్రెస్ట్ ఏపీపై మాత్రం పెట్టలేకపోయారు.

సీన్ కట్ చేస్తే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ ఆలోచనలు వెనక్కి మళ్లినట్టు అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఆయన ఇంకా బయటకు రాలేకపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన వ్యక్తిగత సిబ్బందితో రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. ఆ తర్వాత సర్జరీ.. విశ్రాంతితో కొద్దిరోజులుగా అసెంబ్లీకి కూడా దూరంగా ఉన్నారు. మంచి ముహూర్తం చూసుకుని అంటే ఫిబ్రవరి 2న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఫిబ్రవరి 6న తెలంగాణ భవన్ లో అడుగుపెట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా.. డైరెక్ట్ గా నల్లగొండ సభలో ప్రత్యక్షమయ్యారు.

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను సంప్రదించే ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం మహారాష్ట్ర నేతలకు మాత్రం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా క్లారిటీ ఇవ్వాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు అధిష్టానానికి హుకుం జారీ చేశారు. కానీ కేసీఆర్ కానీ..కేటీఆర్ కానీ వారికి ఫోన్లు రెస్పాండ్ అవ్వలేదు. దీంతో.. అక్కడ వారు వారి రాజకీయ భవిష్యత్ కోసం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోయారు.

మొత్తంగా తెలంగాణ పాలనే దేశానికి ఆదర్శమన్నారు.. అప్పట్లో గుజరాత్ మోడల్.. ఇప్పుడు తెలంగాణ మోడల్ అని గప్పాలు కొట్టారు. అలాంటి పాలన అందిస్తున్న టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని ప్లాన్ చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కానీ సొంత రాష్ట్రంలోనే గట్టి ఎదురుదెబ్బ తాకడంతో గులాబీబాస్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ అయిపోయారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. కానీ ఇంట గెలవలేని పార్టీ బయట ఎలా గెలుస్తుందంటూ విమర్శల వాన కురుస్తోంది. దీని అంతటికి కారణం పార్టీ పేరు మార్చడమే అని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్రసమితిగా మార్చడంతో.. తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని చాలా మంది భావిస్తున్నారు. కాబట్టి.. టీఆర్ఎస్ పేరుతోనే ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే, త్వరలో మరోసారి పార్టీ పేరు మార్చాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చితేనే రాజకీయంగా మనుగడ ఉంటుందని భావిస్తున్నారు. పేరు మార్చిన తర్వాత అయినా కేసీఆర్ కు కలిసివస్తుందా? లేదా? చూడాలి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -