AP Pensions: పెన్షన్ పొందాలనుకునే ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇంటినుంచి పెన్షన్ ఎలా పొందాలంటే?

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ బుదవారం మధ్యాహ్నం నుంచి జరుగుతోంది. అయితే, సరైన సమాచారం లేక చాలా మంది లబ్ధి దారులు ఉదయం నుంచి వచ్చి సచివాలయాల్లో పడిగాపులు కాశారు. కొంతమంది వృద్దులు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతీ నెల ఇంటికి వచ్చి ఇచ్చేవారని.. కానీ.. ఇప్పుడు సచివాలయానికి వెళ్లడం ఇబ్బందిగా మారిందని వృద్దులు చెబుతున్నారు. పైగా ఎండకావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. బుధవారం మ‌ధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ మొదలైంది. ఈనెల 6 లోగా పెన్ష‌న్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేట‌గిరీల వారీగా పెన్ష‌న్ల పంపిణీకి విధివిధానాలు జారీ అయ్యాయి. కొంత‌మందికి ఇంటివ‌ద్ద పెన్ష‌న్ న‌గదు పంపిణీ జరుగుతుంది. మిగిలిన వారికి గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల వ‌ద్ద పంపిణీకి ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు,అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారు, మంచాన‌ప‌డ్డవారు, వృద్ద వితంతువుల‌కు ఇంటివ‌ద్ద పంపిణీ చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది.

గ్రామ స‌చివాల‌యాల‌కు చాలా దూరంగా ఉన్న వారికోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని కలెక్ట‌ర్ల‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో పెన్షన్ల పంపిణీకి 2ల‌క్ష‌ల 66 వేల 158 మంది వాలంటీర్లు ఉండేవారు. కానీ, ఇప్పుడు ల‌క్షా 27వేల 177 మంది మాత్ర‌మే స‌చివాల‌య సిబ్బంది ఉన్నారు. స‌చివాల‌య సిబ్బందిలో కొంత‌మంది బీఎల్ వోలుగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల విధులు నిర్వహిస్తున్నారు. స‌రిప‌డా సిబ్బంది లేక‌పోవ‌డంతో రెండు కేట‌గిరీలుగా పెన్ష‌న్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణ‌యించింది. పెన్ష‌న్ల పంపిణీ కోసం ఉద‌యం 9 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ స‌చివాల‌యాలు ప‌నిచేయాల‌ని ఉత్త‌ర్వుల్లో వెల్లడించింది.

కాగా.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏపీలో కొత్త రాజకీయానికి దారి తీసింది. ప్రతిపక్ష పార్టీ కేసుల కారణంగానే పెన్షన్ల పంపిణీకి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. వారంటీర్లపై ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేయడం వలనే ఇప్పుడు ఈ పరిస్తితి వచ్చింది. దీంతో, పెన్షన్లు, వాలంటీర్ల చుట్టూ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.

ఏపీలో వాలంటీర్ల చుట్టూ వివాదాలు ముసురుకోవడం ఇదేం కొత్తకాదు. కాకపోతే ఇప్పుడు ఎన్నికల ముందు ఇది మరింత ముదిరింది. వాలంటీర్లు వేధిస్తున్నారని, డేటా కలెక్ట్ చేస్తున్నారంటూ రకరకాల ఆరోపణలు చేశాయి విపక్షాలు. అయితే ప్రతి నెల ఒకటో తేదీన వృద్ధులకు పింఛన్లను వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నేతృత్వంలోని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్‌ డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు.

ఇక ఇక్కడి నుంచి పొలిటికల్ వార్ ముదిరింది. వృద్ధులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకున్నది టీడీపీనే అని వైసీపీ ఆరోపించింది. కాదు కాదు.. ఈ కుట్ర వెనుకున్నది వైసీపీనే అని టీడీపీ అంటోంది. దీంతో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని సూచనలు చేసింది ఈసీ. దీంతో సచివాలయాల దగ్గరికి వచ్చి వృద్ధులు పింఛన్లు తీసుకోవాల్సి వస్తోంది. అయితే వారికి ఇబ్బందులు కలగడం, ఎన్నికల్లో ఓట్లపై ఎఫెక్ట్ పడుతుందన్న విషయాలపై రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేపట్టాలని సీఎస్ ను కలిసి విజ్ఞప్తి చేశారు టీడీపీ నేతలు. అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత ఫోన్ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి వెళ్లి వృద్ధులు ఇబ్బంది పడకుండా పంపిణీ చేయాలన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -