Chandrababu And Lokesh: బాబు, లోకేశ్ కేసులకు సంబంధించిన పత్రాలను కాల్చేశారా.. సిట్ అధిపతి కామెంట్లలో అర్థముందా?

Chandrababu And Lokesh: తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేశారు. అయితే, అధికారం చేతులు మారిన వెంటనే అధికారులు దానికి సంబంధించిన హార్డ్ డిస్కులు ద్వంసం చేశారు. ఏపీలో కూడా అదే తరహా పరిస్థితి నెలకొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి హెరిటేజ్ సంస్థ సీఐడీకి ఇచ్చిన పత్రాలను దహనం చేశారు. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. వాటిని తగలబెట్టడాన్ని స్థానికులు వీడియోలు తీయడంతో వ్యవహారం బయటపడింది. సిబ్బందిని స్థానికులు ప్రశ్నించగా సీఐడీ చీఫ్ రాఘురామిరెడ్డి ఆదేశాలతోనే పత్రాలు తగలబెట్టినట్లు చెప్పారు. అసలు ఆ ప్రతాలను ఎందుకు తగలబెట్టారు? ఆ పత్రాలు అనవసరమైనవే అయితే మీడియాను ఎందుకు అనుమతించలేదు స్థానికులు తీసిన వీడియోలు ఇవ్వాలని ఎందుకు అడిగారు… ఈ వ్యవహారమంతా పలు అనుమానాలు కలిగిస్తోంది.

సిట్ కార్యాలయం ఆవరణలో కాల్చివేసిన పత్రాలు… ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ నుంచి సేకరించిన ఆధారాలకు సంబంధించినవేనని టీడీపీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలతోపాటు ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయని వారు అంటున్నారు. జగన్ ఆదేశాలతోనే సీఐడీ చీఫ్ రఘురామిరెడ్డి పత్రాలను ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. రఘురామిరెడ్డిపై బీజేపీ, టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు విమర్శించారు.

సీఐడీ మాత్రం అనవసరమైన జిరాక్స్ పేపర్లను మాత్రమే కాల్చామని చెబుతోంది. ఇందుకు సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి హెరిటేజ్ సంస్థ ఇచ్చిన ఆధారాల పత్రాలు, డాక్యుమెంట్లు సేఫ్ గా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో ఐదు ఛార్జిషీట్లు వేశామని ఐజీ అన్నారు. ప్రతికేసులో 12 నుంచి 40 మంది దాకా నిందితులున్నారని… ప్రతి ఛార్జిషీట్ లో 8 వేల నుంచి 10 వేల పేజీలు ఉన్నాయన్నారు. లక్షల పేజీలను జిరాక్స్ తీస్తే కొన్ని వేస్ట్ అవుతాయని… వాటిని తగులబెడితే తప్పేంటని ఆయన అంటున్నారు. కేసులో అన్ని ఆధారాలు చట్టబద్ధంగానే సేకరించామని స్పష్టం చేశారు. ఇందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని చెబుతున్నారు.

కానీ.. అధికారుల సమాధానం మాత్రం నమ్మసక్యంగా లేదు. అనవసరం అయినవి అయితే వాటిని ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా తగలబెట్టారు? మీడియాను కూడా ఎందుకు అనుమతించలేదు? స్థానికులు వీడియోలు తేస్తే వాటిని ఎందుకు తీసుకునే ప్రయత్నం చేశారు? ఈ ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం లేదు.

టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. పత్రాల కాల్చివేతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు సృష్టించారు కాబట్టే ఆ ప్రతాలను కాల్చేశారని విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫేక్ డాక్యుమెంట్ల గుట్టు బయటకు రాకుండా వాటిని ధ్వంసం చేశారని అన్నారు. అంతటి కీలకమైన కేసుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల ముందు తగలబెట్టడమేంటని నిలదీస్తున్నారు. అసలు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పత్రాల కాల్చివేతపై సీఐడీకీ హెరిటేజ్ సంస్థ లేఖ రాసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన సీఐడీ అభ్యర్థన మేరకు కీలక పత్రాలు ఇచ్చామని పేర్కొంది. చట్టాన్ని గౌరవించి ఎంతో నమ్మకంగా ఇచ్చిన పత్రాలను దహనం చేయడంపై కలత చెందాని లేఖలో ప్రస్తావించింది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన పత్రాలను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత సీఐడీపై ఉందని చెప్పింది. హెరిటేజ్ కీలక పత్రాల భద్రత, గోప్యతపై అనేక అనుమానాలున్నాయని వెల్లడించింది. తాజా పరిస్థితులపై సీఐడీ వివరణ ఇవ్వాలని కోరింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు పత్రాల కాల్చివేతపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే.. సిట్ ఆఫీస్ పరిసరాల్లోకి అధికారులు ఎవర్నీ అనుమతించడం లేదు. సిట్ అధికారులు కాల్చివేసిన ప్రతాలు అవసరమైనవేనా లేదా జిరాక్స్ పేపర్లా అనే కోణంలో విచారిస్తున్నారు. వైసీపీ ఓటమి భయంతోనే ఇలాంటి కుట్రలు చేస్తోందని టీడీపీ విమర్శిస్తుంది. చేసిన తప్పులు బయటకు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -