T20 World Cup: సెమీస్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే

T20 World Cup: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో టీమిండియా ప్రదర్శన చూసినప్పుడే టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని చాలా మంది సందేహించారు. అయితే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్ తర్వాత జరిగిన టోర్నీల్లో రోహిత్, సూర్యకుమార్ ఫామ్ అభిమానులకు ఆశలు రేకెత్తించాయి. ఆది నుంచి బౌలింగ్‌పైనే ఎన్నో అనుమానాలు ఉన్నా ప్రపంచకప్ జట్టులోకి షమీ, అశ్విన్ రావడంతో వాళ్లపై ఆశలు చిగురించాయి.

 

వాస్తవానికి ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు రావడమే గొప్ప అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓపెనింగ్ జోడీ దారుణంగా విఫలం కావడం, బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, మిడిలార్డర్ నిలకడలేమి, ఫీల్డింగ్‌లో లోపాలు వంటివి కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌ చివరి బంతికి గెలిచింది. ఆ రెండు మ్యాచ్‌లలో ఫలితం వేరుగా వచ్చి ఉంటే భారత్ సెమీస్‌లోకి ప్రవేశించేది కాదు.

 

 

కేఎల్ రాహుల్ పదే పదే విఫలమవుతున్నా అతడిని జట్టులో కొనసాగించారు. టీ20 క్రికెట్‌లో ఓపెనర్లు రాణించడం ఎంతో ముఖ్యం. కానీ ప్రపంచకప్‌లో రోహిత్, రాహుల్ కలిసి ఒక్క మంచి భాగస్వామ్యం కూడా నిర్మించలేదు. ఈ ప్రపంచకప్‌లో వీళ్లిద్దరూ 215 బంతులు ఆడి కేవలం 244 పరుగులు మాత్రమే చేశారు. రోహిత్, రాహుల్ హాఫ్ సెంచరీలు పసికూన జట్లపై వచ్చాయి. బలమైన పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి జట్లపై ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. సెమీస్‌లో కూడా వీళ్లిద్దరు విఫలం కావడం భారత్ స్కోరుపై ప్రభావం చూపింది. ఒకవేళ వీళ్లిద్దరూ రాణించి ఉంటే 180 పరుగులకు పైగా స్కోరు నమోదయ్యేది.

 

వాళ్లిద్దరూ ఉంటే బౌలింగ్ మరోలా ఉండేదా?
ఈ ప్రపంచకప్ ఆసాంతం బౌలింగ్, ఫీల్డింగ్ పేలవంగా ఉన్నాయనేది వాస్తవం. భువనేశ్వర్, అర్ష్‌దీప్ లాంటి బౌలర్లను బంగ్లాదేశ్ ఓపెనర్లు చితక్కొట్టినప్పుడే మన బౌలింగ్ స్థాయి ఏంటో అర్ధమైంది. ఇంగ్లండ్ వంటి జట్టులో బట్లర్, హేల్స్, స్టోక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు బౌలింగ్ ఎలా వేయాలో కూడా మనోళ్లకు అర్ధం కాలేదు. ఐపీఎల్ అనుభవాన్ని ఉపయోగించుకోలేదు. కానీ ఇంగ్లండ్ మాత్రం ఐపీఎల్ ద్వారా మనోళ్ల బలహీనతలను ముందే గుర్తించి దెబ్బ కొట్టింది. బుమ్రా, జడేజా ఉంటే టీమిండియా బౌలింగ్ మరోలా ఉండేది. మొత్తానికి ప్రపంచకప్ తెస్తారన్న అభిమానుల ఆశలపై టీమిండియా ఆటగాళ్లు నీళ్లు చల్లారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -